గాంధీజీ విగ్రహం ఎదురు చూపులు
కోసం ఎదురుచూసిన మహాత్ముడు!
శ్రీరంగాపూర్, అక్టోబర్ 2: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి(Mahatma Gandhi's birth anniversary) సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనను స్మరించుకుంటుండగా.. శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం మాత్రం సమయం మధ్యాహ్నం ఒకటి దాటిన పూలమాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కనిపించింది. ప్రతి ఏడాది గాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించే ఆనవాయితీ ఉండగా, ఈసారి మాత్రం కనీసం పూలమాల కూడా వేయకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది
.విగ్రహం ముందు నుంచే ప్రశ్న..అహింస, సత్యం, శాంతి మార్గాలను ప్రపంచానికి చాటిన మహాత్ముడి విగ్రహానికి జయంతి రోజున కనీస గౌరవం కూడా దక్కకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు ఇప్పటికైనా స్పందించి గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాలని స్థానికులు కోరుతున్నారు.
జయంతి వేడుకలు మాటల్లోనేనా?
గాంధీజీ ఆశయాలను స్మరించుకోవడం అంటే కేవలం ప్రసంగాలు చేయడం మాత్రమే కాకుండా, ఆయనకు గౌరవం చూపడం కూడా బాధ్యతేనని స్థానికులు పేర్కొంటున్నారు. ఇకనైనా సంబంధిత నాయకులు, అధికారులు స్పందించి విగ్రహ పరిసరాలను శుభ్రపరిచి, ప్రతి జాతీయ పర్వదినం సందర్భంగా గౌరవప్రదంగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు.