6 September, 2026 | 10:27 AM

వనపర్తికి నిధుల వరద!

06-09-2026 | 09:10am
  1. పాలమూరు తో ములుగు కు ఆత్మీయ అనుబంధం 
  2. ఎమ్మెల్యే మేఘారెడ్డి అడిగిన నిధులను మూడు దఫాల్లో ఇస్తాం
  3. రూ.69 కోట్ల హ్యామ్‌ ప్రాజెక్టు పైలాన్‌ ఆవిష్కరణ 
  4. కాంగ్రెస్‌ జెండా ఎగురుతుంది: మంత్రి జూపల్లి
  5. రూ.2,400 కోట్ల పనులకు జీవోలు తెచ్చాం పనులు జరుగుతున్నాయి

వనపర్తి, సెప్టెంబర్ 05 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్‌ బిడ్డలతో ములుగు బిడ్డలకు ఆత్మీయ అనుబంధం ఉందని  మీరు కృష్ణా నీళ్లు తాగితే తాము గోదావరి నీళ్లు తాగుతామని, మీరు మల్లన్నను మొక్కితే తాము రామప్ప, మీరు జోగులాంబ అమ్మవారిని మొక్కితే మేము సమ్మక్క-సారక్కలను మొక్కుతామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలోని చిట్యాల వద్ద రూ.69 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న హ్యామ్‌ ప్రాజెక్టు, పంచాయతీరాజ్‌ శాఖ రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన పైలాన్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి మంత్రి సీతక్క ఆవిష్కరించారు.

అనంతరం జిల్లా కేంద్రం లోని రాజీవ్ చౌరస్తా లో డిసిసి అధ్యక్షులు శివ సేనా రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్నర్ సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ చావైనా  బతుకైనా ప్రజల మధ్యలోనే ఉంటామని స్పష్టం చేశారు. గత పదేళ్లలో పల్లెలను విస్మరించారన్నారు. కానీ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 15 లక్షల రేషన్‌ కార్డులు, 70 వేల ఉద్యోగాలు కల్పించిందని, కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు కూడా జారీ చేసిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అనుభవిస్తూ కూడా తాము వాటిని పొందలేదంటూ కొందరు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె విమర్శించారు. రుణమాఫీ అత్యధికంగా బీఆర్‌ఎస్‌ నాయకులకే జరిగిందని పేర్కొంటూ, బీఆర్‌ఎస్‌ అంటేనే తప్పుడు ప్రచారమని మంత్రి సీతక్క విమర్శించారు.

ఎమ్మెల్యే అడిగిన నిధులన్నీ ఇస్తాం 

పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే ఆయా శాఖల నుంచి సుమారు రూ.300 కోట్ల నిధులు తీసుకొచ్చి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి కోరిన నిధులను సైతం మూడు దఫాల్లో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌ జెండా ఎగురుతుంది: మంత్రి జూపల్లి 

గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు  తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ జెండా ఎగురుతుందని, ప్రజా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

వనపర్తి కి నిధులను మంజూరు చేయాలి.... ఎమ్మెల్యే మేఘారెడ్డి 

వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో రూ.2,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు జీవోలు తీసుకొచ్చి పనులు కొనసాగిస్తున్నామని తెలిపారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నియోజకవర్గంలో 129 అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణానికి రూ.15 కోట్లు, మహిళా భవనాల నిర్మాణాలకు రూ.11 కోట్లు అవసరమని ఎమ్మెల్యే తెలిపారు. తండాల్లో మిగిలిన రహదారి పనులను పూర్తి చేసేందుకు రూ.100 కోట్లు, తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.కోటి నిధులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం తనకు సహకరించాలని  మంత్రి సీతక్క కు విజ్ఞప్తి చేశారు.

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన మంత్రి సీతక్క 

కార్నర్‌ మీటింగ్‌ జరుగుతున్న సమయంలో అంబులెన్స్‌ రావడంతో మంత్రి సీతక్క తన ప్రసంగాన్ని కాసేపు నిలిపివేశారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వాలని ప్రజలు, కార్యకర్తలను సూచించారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో  ఎంపీ మల్లు రవి, డిసిసి అధ్యక్షులు శివ సేనారెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు