కుక్కల దాడులతో భయాందోళన!
రెండు రోజుల్లో 10 మందికి కుక్క కాట్లు
పెద్దలు, చిన్నారులపై వీధి కుక్కల దాడులు
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
పెబ్బేరు: పెబ్బేరు మున్సిపాలిటీ(Pebbair Municipality)లో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలోని 8, 9వ వార్డుల పరిధిలో సినిమా టాకీస్ రహదారి వెంబడి వీధి కుక్కలు(Stray Dogs) ప్రజలపై దాడులకు దిగుతున్నాయి. నిన్నటి నుంచి నేటి వరకు సుమారు 10 మందిని కుక్కలు కరిచినట్లు స్థానికులు చెబుతున్నారు. రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న పెద్దలు, చిన్నారులు అనే తేడా లేకుండా కుక్కలు దాడి చేస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఎక్కడి కుక్కలో.. ఇక్కడ వదిలి వెళ్తున్నారా?
ఇతర ప్రాంతాల నుంచి కుక్కలను తీసుకొచ్చి పట్టణంలోని సంత ప్రాంతంలో వదిలి వెళ్తున్నట్లు సమాచారం ఉందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో కుక్కల సంఖ్య పెరిగి ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు రహదారులపైకి రావాలన్నా, వృద్ధులు నడుచుకుంటూ వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించరా?
వరుసగా కుక్కల దాడులు(Dog Attacks) జరుగుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే స్పందించాలని కోరుతున్నారు. కుక్కల బెడదను నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టడంతో పాటు, బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి, 8, 9వ వార్డుల్లో కుక్కల సమస్యపై తక్షణమే స్పందించి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.