కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. అసలేం జరిగింది?

13-10-2026 | 11:51am

కాంగ్రెస్ ఓటములకు ఈసీ బాధ్యత వహించాలా? రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి ఫైర్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వరుస ఎన్నికల ఓటములకు ఎన్నికల సంఘం (Election Commission) లేదా సుప్రీంకోర్టు బాధ్యత వహించాలా? అంటూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విపక్షాల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగ సంస్థలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని ఆయన వ్యాఖ్యానించారు.

పార్లమెంటులో ప్రతిపక్షాల వ్యవహారశైలి దేశ ప్రజల ముందు నవ్వులపాలైందని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్‌పై విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను కూడా ఆయన ప్రస్తావించారు.

రాజ్యాంగ సంస్థలపై ఒత్తిడి తేవడం సరికాదు

ప్రతిపక్ష పార్టీగా అధికారంలోకి రావాలని కోరుకోవడంలో తప్పులేదని, అయితే రాజకీయ లక్ష్యాల కోసం రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచేలా వ్యవహరించడం సరికాదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే అందుకు ఎన్నికల సంఘం లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యత వహించాలా? కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన బాధ్యత కూడా వారిదేనా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలకు సంబంధించి సంస్థలపై నిందలు వేయడం ఎంతవరకు సమంజసమో కాంగ్రెస్ నేతలు ఆలోచించాలని సూచించారు.

CJIపై ఒత్తిడి ప్రయత్నాలంటూ విమర్శలు

తమకు అనుకూలంగా ఆదేశాలు రాలేదనే కారణంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. వేలాదిగా వెళ్లి న్యాయవ్యవస్థపై ప్రభావం చూపేందుకు ప్రయత్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు తగదని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు స్వతంత్రత, రాజ్యాంగ సంస్థల గౌరవం కాపాడటం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు, ఆందోళనల వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలను ప్రజలు గమనించాలని అన్నారు.

దేశం ఎవరి ప్రైవేట్ ఆస్తి కాదు

భారతదేశం ఏదైనా ఒక కుటుంబానికి చెందిన ప్రైవేట్ ఆస్తి కాదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలోని 140 కోట్ల ప్రజలకు స్వేచ్ఛగా ఆలోచించి ఓటు వేసే హక్కు ఉందని గుర్తుచేశారు. ప్రజల తీర్పును గౌరవించడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడటం రాజకీయ పార్టీలకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. భారతదేశంలో నియంతృత్వ రాజకీయాలకు స్థానం లేదని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే పాలన, ఎన్నికల ప్రక్రియ కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు