ఓ ఐఏఎస్ అధికారి ఇలా చేస్తే ఎలా?
చిత్తూరు జిల్లా కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కడ) ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌పై బెంగళూరులో క్రిమినల్ కేసు నమోదైంది. పబ్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పాటు దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 9వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత బెంగళూరులోని రెసిడెన్సీ రోడ్డులో ఉన్న కావోర్ బార్ అండ్ రెస్టారెంట్‌లో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ తన నలుగురు స్నేహితులతో కలిసి పబ్‌లో ఉన్నారు.
పబ్‌లో ఉన్న కస్టమర్ల వయసును నిర్ధారించేందుకు పోలీసులు గుర్తింపు కార్డులను పరిశీలిస్తుండగా వివాదం తలెత్తినట్లు సమాచారం. తనిఖీల సందర్భంగా వికాస్ మర్మత్ పోలీసులతో వాగ్వాదానికి దిగారని, దురుసుగా ప్రవర్తించడంతో పాటు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించి, బెదిరింపులకు పాల్పడ్డారనే అభియోగాలు కూడా నమోదయ్యాయి.ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్ అరుణ్ సాలుంకే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌తో పాటు అభయ్, ఉదయ్ సింగ్, నితీష్, రోషన్ పేర్లను కూడా కేసులో చేర్చారు. ఘటనకు సంబంధించి పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఆరోపణలపై విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.