వరుణుడి ఎంట్రీ.. మేఘాల ముసురు.. వానల జోరు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ (Weather Department) చల్లటి కబురు చెప్పింది. శీతాకాలంలోనూ ఎండాకాలాన్ని తలపిస్తున్న ఉక్కపోత నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందని తెలిపింది. రానున్న రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈశాన్య రుతుపవనాల (Northeast Monsoon) రాకకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది.
ఎండాకాలం ముగిసి నెలలు గడుస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు. శీతాకాలం ప్రారంభమైనప్పటికీ ఎండ తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అంచనాలను వెల్లడించింది. ఈ నెల 15 నుంచి 18 మధ్య తెలంగాణలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలంగాణలో ఈ జిల్లాలకు వర్ష సూచన
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం.. ఖమ్మం, ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడొచ్చని, మరికొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగవచ్చని పేర్కొంది. వర్షాలు కురిస్తే ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది.
ఏపీలోనూ వర్షాలు కురిసే అవకాశం
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ (Andhra Pradesh Weather) వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చు. మరికొన్ని జిల్లాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు వాతావరణ శాఖ సూచనలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.