యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రథమ బహుమతి
యువ టూరిజం క్లబ్ పర్యాటక పోటీ
యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 27 (విజయ క్రాంతి): ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని(World Tourism Day) పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా పర్యాటక శాఖ(Yadadri Bhuvanagiri District Tourism Department) ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్య యువ పర్యాటక క్లబ్ ఆధ్వర్యంలో పర్యాటక ప్రోత్సాహక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ(Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Temple) సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రత్యేక శాస్త్రీయ నృత్య ప్రదర్శన నిర్వహించారు.
పాతగుట్ట, సురేంద్రపురి ఆలయాల విశిష్టతను తెలియజేస్తూ లఘు వీడియోలు(Short videos), రీల్స్, స్కిట్స్ ద్వారా పర్యాటక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
విద్యార్థుల ప్రతిభను గుర్తించిన నిర్వాహకులు యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయిలో యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు(Yadagirigutta Government Junior College) ప్రథమ బహుమతి ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు, ఇంటర్మీడియట్ విద్యాధికారి సురేష్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులు బహుమతిని అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పి. మంజుల, జిల్లా పర్యాటక అధికారి ధనుంజయ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు రాజు, రమేష్, నాగలక్ష్మి, పద్మ రేఖ, విద్యార్థులు పాల్గొన్నారు.