యాదగిరిగుట్ట లో ట్రస్ట్ బోర్డ్ మూడవ సమావేశం..

13-10-2026 | 05:56pm

యాదగిరిగుట్ట, అక్టోబర్ 13 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం(Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Temple) ధర్మకర్తల మండలి మూడవ సమావేశంలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి భవనంలో మూడవ పాలకమండలి సమావేశం నిర్వహించారు. 

సమావేశానంతరం ధర్మకర్తల మండలి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి నిత్యం  భక్తులు భారీగా తరలి వస్తున్నారని వారి కోసం  మెరుగైన సౌకర్యాలు  కల్పిస్తున్నామని అన్నారు. ధర్మకర్తల మండలి మూడవ సమావేశంలో  పలు తీర్మానాలను ఆమోదించామని అన్నారు.

దేవస్థానముకు విచ్చేయు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడం, పారిశుద్ధ్య నిర్వహణను పటిష్టపరచడం, ఆలయ సంప్రదాయాలను పరిరక్షించడం లక్ష్యంగా ధర్మకర్తల మండలి సమావేశంలో మొత్తము 17 అజెండా అంశములను మరియు 06 టేబుల్ అజెండా అంశములను ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

సంస్కృత విద్యాపీఠం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం....

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సంస్కృత విద్యాపీఠం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్  (హెచ్ ఏ ఎల్) సంస్థ సీ ఎస్ ర్ నిధులతో దేవస్థానం ఆధ్వర్యంలో శాశ్వత భవన నిర్మాణ పనులు చేపట్టేందుకు సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునే ప్రతిపాదనకు ఆమోదించారు. దీనివల్ల విద్యాపీఠానికి అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి మార్గం సుగమం అయినట్ల అయ్యింది.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు....

అన్నదాన సత్రం వద్ద భక్తుల సౌకర్యార్థం టెన్సైల్ ఫ్యాబ్రిక్ షెడ్, స్టెయిన్లెస్ స్టీల్ (SS) క్యూ లైన్ల ఏర్పాటుకు ఆమోదించారు. కొండపైన భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత పాదరక్షల భద్రపరిచే కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు...

పాతగుట్టలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులను దాతల సహకారంతో చేపట్టేందుకు ఆమోదించడమైనది. రాయిగిరి వద్ద ప్రస్తుతం ఉన్న ఆర్చిగేటు స్థలంలో దాతల సహకారంతో నూతన ఆర్చిగేటు నిర్మాణం చేపట్టేందుకు MOU కుదుర్చుకునే ప్రతిపాదనను ఆమోదించారు. శ్రీ స్వామి వారి ఆలయంలో రంగమంటపం నిత్యకళ్యాణ మండపం నిర్మాణాన్ని దాతల సహకారంతో చేపట్టేందుకు ఒప్పందం   కుదుర్చుకునే ప్రతిపాదనను ఆమోదించారు.

టేబుల్ ఎజెండా అంశములు...

శ్రీ జనార్ధన సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ హైదరాబాద్ వారిచే ఈనెల 28 నుండి 01.11 వరకు శ్రీ తెలంగాణ వేద విద్వాన్ మహా సభలు నిర్వహించుటకు వసతి, ఆల్పాహారము, భోజనములు, కుర్చీలు, మైకులు మొదలగు వాటికి అయ్యే వ్యయము రూ.13.66 లక్షలు అనుమతించుటకు ఆమోదించారు.

కార్తీక మాసము సందర్భముగా  నవంబర్  20 నుండి 22 (03) రోజులు కార్తీక ఉత్సవములు నిర్వహించుటకు ఆమోదించడమైనది.దేవస్థాన సిబ్బందికి, పెన్షనర్లకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము వృద్ధి చేయబడిన డి.ఎ.. డి.ఆర్. లను అనుమతించుటకు ఆమోదించడమైనది.

భక్తుల సౌకర్యాల విస్తరణ, ఆలయాల అభివృద్ధి, విద్యా సంస్థల మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుదల, దాతల భాగస్వామ్యంతో అభివృద్ధి పనుల నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ధర్మకర్తల మండలి పై ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

భవిష్యత్తులోనూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు, యాదగిరిగుట్ట క్షేత్ర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దేవస్థానం కృషి చేయనుందని తెలిపారు.  ఈ సమావేశంలో పాలకమండలి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, పాలకమండలి   సభ్యులు టి విజయేందర్ గౌడ్, శ్రీమతి పి. ఈశ్వరమ్మ యాదవ్, జి. మల్లయ్య, కె. స్వాతి, ఎమ్. రాఘవేంధర్ రావు, డా. లక్ష్మీ నారాయణ నాయక్,

దేవాదాయ శాఖ కమిషనర్, ఎక్స్ అఫిసియో సభ్యులు ఎం హనుమంతరావు,  యాదగిరిగుట్ట దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి, ఎక్స్ అఫిసియో సభ్యులు భవాని శంకర్,. దేవస్థానం ప్రధాన అర్చకులు, ఎక్స్ ఆఫీస్ యో సభ్యులు  కాండూరి వెంకటాచార్యులు, అధికారులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు