ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను బర్తరఫ్ చేయాలి
ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారంటూ సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్(CEC Gyanesh Kumar)ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సుల్తానా అధ్యక్షతన జరిగిన సీపీఎం ఇల్లెందు మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు.
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నాయకులపై లాఠీచార్జి చేయడం సరికాదన్నారు. శాంతియుత నిరసనలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే భవిష్యత్తులో ప్రజా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ఏజే రమేష్, అబ్దుల్ నబీ, ఆలేటి కిరణ్ కుమార్, తాలూరి కృష్ణ, మన్యం మోహన్ రావు, ఎస్కే ఖాదర్, మాదారపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.