మిత్రుడి మరణవార్తతో చలించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు

13-10-2026 | 06:21pm

తాటి శ్రీనివాస్ గౌడ్ అంత్యక్రియల్లో పాల్గొని కన్నీటి నివాళి

బేగంపేట, అక్టోబర్ 13 (విజయక్రాంతి): మిత్రుడి మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పూదరి సర్వేష్ గౌడ్(Senior Congress party leader Pudari Sarvesh Goud) హైదరాబాద్ నుంచి హుటాహుటిన బేగంపేటకు చేరుకుని తన ఆత్మీయ మిత్రుడు తాటి శ్రీనివాస్ గౌడ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందిన శ్రీనివాస్ గౌడ్‌కు మంగళవారం కన్నీటి నివాళులర్పించారు.

రామగిరి మండలంలోని బేగంపేటకు చెందిన  శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చురుకుగా పనిచేశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పూదరి సర్వేష్ గౌడ్ స్వగ్రామానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్వేష్ గౌడ్ మాట్లాడుతూ, తాటి శ్రీనివాస్ గౌడ్ మృతి కాంగ్రెస్ పార్టీకి, తనకు వ్యక్తిగతంగా తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం ఆయన ఎంతో క్రియాశీలకంగా పనిచేశారని, నాయకులు, కార్యకర్తలతో ఆప్యాయంగా మెలుగుతూ అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారని గుర్తుచేశారు.

ఆయనతో కలిసి పనిచేసిన మధుర జ్ఞాపకాలను స్మరించుకుంటూ, శ్రీనివాస్ గౌడ్ లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదని భావోద్వేగానికి గురయ్యారు. మృతుడి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు కొయ్యల రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు