విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు
జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగసాగర్
వసతి గృహంలో ఆకస్మిక తనిఖీ
డివిజన్ స్థాయి క్రీడలపై సమీక్ష
భూపాలపల్లి,(విజయక్రాంతి): విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగసాగర్(District Tribal Welfare Officer Nagasagar) అన్నారు. గొల్లబుద్దారం గ్రామంలోని ఎస్టీ బాలుర వసతి గృహాన్ని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగసాగర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు(Students) కల్పిస్తున్న వసతులు, నిత్యావసర సరుకుల నిల్వలు, భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిబ్బందికి సూచించారు.
హాజరు రిజిస్టర్లను పరిశీలించి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం ఐడీఓసీలో డివిజన్ స్థాయి క్రీడా పోటీల ఏర్పాట్లపై పీడీలు, వ్యాయామ ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. నవంబర్ 11, 12 తేదీల్లో మేడిపల్లి ఆశ్రమ పాఠశాలలో జరిగే పోటీలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు మైదానాలు, తాగునీరు, భోజనం, ప్రథమ చికిత్స వంటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పీడీలు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.