విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకండి

29-10-2026 | 11:03pm

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు.. 

సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్

గజ్వేల్: విద్యార్థులు విలువైన సమయాన్ని వృథా చేసుకోకుండా విద్యపై దృష్టి సారించాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్(Siddipet CP Rashmi Perumal) సూచించారు. గురువారం గజ్వేల్ మహతి ఆడిటోరియంలో నిర్వహించిన షీ టీమ్స్ అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల్లో నేరప్రవృత్తి నివారణ, రహదారి భద్రత, మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.

మైనర్లు వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం ప్రమాదకరమని, తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించారు. తాత్కాలిక ఆకర్షణలకు లోనై చెడు మార్గాల్లోకి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పంచుకోవాలని సూచించారు. మహిళలను గౌరవిస్తూ సమానత్వాన్ని పాటించాలని, ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులను క్లిక్ చేయడం, ఓటీపీలు, వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవడం చేయవద్దన్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి వినియోగం లేదా అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారమిచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, ఎస్‌హెచ్‌ఓ రవికుమార్, సీఐలు రవిరాజు, లతీఫ్, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ దుర్గ, సుజాత డిగ్రీ కళాశాల లెక్చరర్, శ్వేత మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు, షీ టీమ్స్ సభ్యులు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు