స్వాతంత్ర ఉద్యమ సమయంలో సేవాదళ్ పాత్ర కీలకం..
మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి...
ఆదిలాబాద్, అక్టోబర్ 25, (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ సేవాదళ్(Congress Seva Dal) ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు మోతీ రామ్ పాల్గొని సేవాదళ్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. దేశభక్తి, క్రమశిక్షణ, ఐక్యత, సేవాభావం వంటి విలువలను కార్యకర్తల్లో పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ సేవాదళ్ నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలు పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు సమిష్టిగా పనిచేసే తత్వాన్ని, క్రమశిక్షణను, దేశభక్తిని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ప్రజాసేవ పట్ల అంకితభావం తో పనిచేయడానికి ఇటువంటి కార్యక్రమాలు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు స్వాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీతో పాటు సేవాదళ్ సభ్యులు ప్రజల్లో చైతన్యం కల్పించడంలో, దేశభక్తి భావాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ఇన్చార్జ్ బెజ్జంకి అనిల్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇంచార్జ్ గౌలి సంజీవ్ కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఖిజర్ పాషా, సేవాదళ్ జిల్లా జనరల్ సెక్రెటరీ అఫ్సర్ ఖాన్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మునిగేలా నర్సింగ్, జిల్లా కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, కాంగ్రెస్ ఎస్సి విభాగం పట్టణ అధ్యక్షుడు చంద్రాల రాహుల్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, సేవాదళ్ ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.