ఎస్‌ఐఆర్‌పై న్యాయపోరాటం.!
- ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఓటు బచావో దేశ్ బచావో ఉద్యమం.
- నవంబర్ 1న చలో ఢిల్లీకి కాంగ్రెస్ కార్యకర్తలు కదలి రావాలని పిలుపు.
- కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి రవీంద్రనాథ్.
నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): బిజెపి ప్రభుత్వం మరోసారి ఓటు చోరీ ద్వారా తప్పుడు దారిలో ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నికల కమిషన్ను పావుగా వాడుకొని ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లను తొలగించే కుట్రకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ రవీంద్రనాథ్(Congress leader Ravindranath) అన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ నేతలతో ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షకు ముందు మీడియాతో మాట్లాడారు.
ఓటు హక్కు పరిరక్షణ కోసం నవంబర్ 1న కాంగ్రెస్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓటర్ల హక్కులకు భంగం కలుగుతోందని దేశవ్యాప్తంగా 33 కోట్లకు పైగా ఓట్లు, తెలంగాణలో 93 లక్షల ఓట్లు తొలగించారని పేర్కొన్నారు. సామాన్యుడికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఆ వజ్రాయుధాన్ని బిజెపి ప్రభుత్వం నాశనం చేస్తుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు పేర్కొన్నారు.
‘ఓటు బచావో.. దేశ్ బచావో’ నినాదంతో నవంబర్ 1న ఢిల్లీలో భారీ ఆందోళన చేపడుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ నుంచి 15 వేల మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితాలను పరిశీలించి, ఓటు హక్కు కోల్పోయిన వారిని గుర్తించి నమోదు చేసుకునేలా సహకరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.