నష్టపోయిన సోయా పంటను పరిశీలించిన ఎమ్మెల్యే
- రైతులకు అండగా ఉంటాం.. న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ఎదుట ధర్నా
- ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
తలమడుగు అక్టోబర్ 01(విజయక్రాంతి) : తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో రైతు చిన్న రాజారెడ్డి సాగు చేసిన మాళవిక రకం సోయా పంటను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) గురువారం పరిశీలించారు. పంట దెబ్బతినడానికి గల కారణాలను రైతును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. మాళవిక రకం సోయా సాగుతో నష్టపోయిన రైతులకు కంపెనీ నుంచి ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని కంపెనీపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.రైతులకు న్యాయం జరగకపోతే, ఎలాంటి హామీ రాకుంటే రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా చేపడతామని ఎమ్మెల్యే హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.