ఇన్స్టంట్ గ్లో బాక్స్‌లో విషం?.. ఇది చూడండి!
హైదరాబాద్‌లోని కాస్మెటిక్ షాపుల్లో పాకిస్థాన్‌లో తయారైన ఉత్పత్తులను అక్రమంగా విక్రయిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు (INSPECTIONS) నిర్వహించారు. నాంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, గోల్కొండ ప్రాంతాల్లోని కాస్మెటిక్ షాపుల్లో సోదాలు చేపట్టారు. తనిఖీల్లో ‘మేడ్ ఇన్ పాకిస్థాన్’ లేబుల్‌తో ఉన్న కొన్ని ఉత్పత్తులను అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే కొన్ని షాపుల్లో ప్రమాదకర రసాయనాలతో తయారు చేసినట్లు అనుమానిస్తున్న ఫేస్ క్రీములను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
పాకిస్థాన్‌తో పాటు ఇతర దేశాల నుంచి స్కిన్ వైటనింగ్ క్రీములను అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు తమ దర్యాప్తులో (INVESTIGATION) తేలిందని పోలీసులు పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న కొన్ని స్టోర్లను సీజ్ (SEIZE) చేసినట్లు తెలిపారు. బ్యూటీ క్వీన్, బ్యూటీ లేడీస్ ఎంపోరియం, ఎస్జే మెడికల్ స్టోర్ తదితర షాపుల నుంచి భారీగా క్రీములను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రీముల్లో ప్రమాదకర రసాయనాలతో పాటు మెర్క్యురీ వంటి పదార్థాలు ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు.. వాటిని పరీక్షల కోసం పంపిస్తున్నట్లు తెలిపారు.
ఇలాంటి ఉత్పత్తుల వినియోగంతో చర్మ సంబంధిత సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ‘ఇన్స్టంట్ గ్లో’ పేరుతో మార్కెట్లో లభించే కొన్ని స్కిన్ వైటనింగ్ క్రీముల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నాణ్యత, పదార్థాల వివరాలు తెలియని క్రీములను ఉపయోగించడం వల్ల చర్మంపై మంట, మొటిమలు, రంగు మారడం వంటి సమస్యలు రావచ్చని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత షాపుల నిర్వాహకులపై కేసులు (CASES) నమోదు చేసిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి అక్రమ విక్రయాలపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.