విషాదంగా ముగిసిన ప్రేమకథ!
గుంటూరు: స్కూల్ బస్సు ద్వారా ఏర్పడిన పరిచయం చివరకు తీవ్ర విషాదానికి దారితీసింది. గుంటూరు జిల్లా(Guntur District) కాకుమాను మండల కేంద్రంలో 15 ఏళ్ల బాలిక, 22 ఏళ్ల యువకుడు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తుండగా.. అనూహ్యంగా ఇంటి నుంచి వెళ్లిపోయిన మరుసటి రోజే విగతజీవులుగా కనిపించడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
కాకుమాను మండల కేంద్రంలో తాత, అమ్మమ్మ వద్ద ఉంటూ బాలిక పదో తరగతి చదువుతోంది. ఆమె చదువుతున్న పాఠశాల బస్సుకు డ్రైవర్‌గా సాంబశివరావు పనిచేస్తున్నాడు. సాంబశివరావు కుమారుడు(School Bus Driver Son) విఘ్నేష్ (22) ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. తండ్రి కోసం తరచూ స్కూల్ వద్దకు వెళ్లే క్రమంలో బాలికతో విఘ్నేష్‌కు పరిచయం ఏర్పడినట్లు సమాచారం. కొంతకాలానికి ఈ పరిచయం ప్రేమగా మారినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇద్దరూ అకస్మాత్తుగా ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగానే.. బుధవారం ఉదయం కోనంకి గ్రామ చెరువులో ఇద్దరి మృతదేహాలు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు(Police) ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇద్దరూ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఇద్దరి మధ్య ఉన్న సంబంధం తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.