గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి
ఉట్నూర్ ఐటీడీఏ పీఓ మంద మకరందు..
ఉట్నూర్, అక్టోబర్ 02 ( విజయక్రాంతి): ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం మహాత్మా గాంధీజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు(ITDA Project Officer Manda Makarandu) పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ... మహాత్మా గాంధీజీ అహింస, సత్యం, శాంతి, స్వచ్ఛత వంటి విలువలను ప్రజలకు చాటి చెప్పారని తెలిపారు.
గాంధీజీ చూపిన సత్యం, అహింసా మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పేర్కొన్నారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో కలిసి గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వసంతరావు జాదవ్, ఐటీడీఏ ఈ ఈ తానాజీ జాదవ్ ఐటీడీఏ కార్యాలయఅధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.