భద్రాద్రి జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ముందడుగు

08-09-2026 | 12:24am

స్థలాలను పరిశీలించిన ఏఏఐ సాంకేతిక బృందం

విమానాల  రాకపోకల పై సాంకేతిక అధ్యయనం

రైల్వే లైన్‌ వల్ల కలిగే సాంకేతిక అంశాలపై ప్రత్యేక పరిశీలన

సాధ్యాసాధ్యాల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు

కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం(Greenfield Airport) ఏర్పాటుకు సంబంధించి కీలకమైన ముందడుగు పడింది. విమానాశ్రయ ఏర్పాటుకు గుర్తించిన ప్రతిపాదిత స్థలాల సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మల్టీ డిసిప్లినరీ సాంకేతిక బృందం(AAI technical team) రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం జిల్లాకు చేరుకుని మొదటి రోజు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది.

ఏఏఐ సభ్యులు భరత్ రెడ్డి, ఎండీ ఏవియేషన్ నేతృత్వంలోని సాంకేతిక బృందం ప్రతిపాదిత విమానాశ్రయ స్థలాలను పరిశీలిస్తూ భూమి లభ్యత, స్థల విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, రన్‌వే ఏర్పాటుకు అనుకూలత, విమానాల రాకపోకలకు అవసరమైన అప్రోచ్ ఫన్నెల్, నైట్ ల్యాండింగ్, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను అధ్యయనం చేసింది.

జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాలుగా సుజాతానగర్ మండలంలోని సీతంపేట, సుజాతానగర్, దుమ్ముగూడెం మండలంలోని దుమ్ముగూడెం, ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి, దమ్మపేట మండలంలోని పాల్వంచ/దమ్మపేట, చుంచుపల్లి మండలంలోని పెనగడప ప్రాంతాలను గుర్తించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా షెడ్యూల్ ప్రకారం ఆయా ప్రాంతాల్లో స్థల పరిశీలన, సర్వే, సాంకేతిక అంశాల పరిశీలన కొనసాగుతోంది.

ఈ సందర్భంగా సింగరేణి గెస్ట్‌హౌస్‌లో,ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి, జిల్లా కలెక్టర్ అంకిత్‌తో ఏఏఐ సాంకేతిక బృందం సమావేశమై ప్రతిపాదిత విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా చర్చించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడం, ATR-72 తరహా విమానాలతో పాటు పెద్ద ఎయిర్‌బస్ A320/A321 విమానాల రాకపోకలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చ జరిగింది.

పెద్ద విమానాల రాకపోకలకు అనుగుణంగా సుమారు 2,500 నుంచి 2,700 మీటర్ల రన్‌వే అవసరమయ్యే అవకాశాలను సాంకేతిక బృందం పరిశీలించింది. రన్‌వే ఏర్పాటుకు అవసరమైన భూమి, భవిష్యత్ విస్తరణకు అవకాశాలు, నైట్ ల్యాండింగ్‌కు అవసరమైన సదుపాయాలు, భద్రతా పరికరాలు తదితర అంశాలపై కూడా అధ్యయనం చేస్తున్నారు.

ప్రతిపాదిత ప్రాంతానికి సమీపంలో ఉన్న విద్యుదీకరించిన బొగ్గు రవాణా రైల్వే లైన్ కూడా సాంకేతిక బృందం పరిశీలనలో ప్రధాన అంశంగా నిలిచింది. రైల్వే మార్గం విమానాల అప్రోచ్ ఫన్నెల్ పరిధిలోకి వచ్చే అవకాశాల నేపథ్యంలో దాని వల్ల ఏర్పడే సాంకేతిక ప్రభావాలను పరిశీలిస్తున్నారు. అవసరమైతే ‘షీల్డింగ్‌’ ప్రక్రియ ద్వారా సాంకేతిక అవరోధాన్ని అధిగమించే అవకాశాలను కూడా పరిశీలించడంతో పాటు, రైల్వే శాఖ నుంచి అవసరమైన ఎన్‌ఓసీ పొందే అంశంపై చర్యలు చేపట్టనున్నారు.

పరిశీలనలో భాగంగా సంబంధిత అధికారులు సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం, రెవెన్యూ మ్యాపులు, భౌగోళిక కోఆర్డినేట్లు, స్థల హద్దులు, అప్రోచ్ రోడ్లు, రెవెన్యూ,సాంకేతిక రికార్డులను సిద్ధంగా ఉంచి ఏఏఐ బృందానికి అందుబాటులో ఉంచారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న వివరాలను పరిశీలిస్తూ, రికార్డులతో సరిపోల్చి బృందం సాంకేతిక అధ్యయనం నిర్వహిస్తోంది. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాల అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

 జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ఏఏఐ సాంకేతిక బృందం నిర్వహిస్తున్న పరిశీలనకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. అవసరమైన రెవెన్యూ, సర్వే, సాంకేతిక సమాచారాన్ని సిద్ధంగా ఉంచి, బృందం క్షేత్రస్థాయి పరిశీలన సజావుగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు మొదటి రోజు ప్రతిపాదిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించగా, రెండో రోజు కూడా షెడ్యూల్ ప్రకారం మిగిలిన ప్రాంతాలు, సాంకేతిక అంశాలను బృందం పరిశీలించనుంది. మొత్తం పరిశీలన అనంతరం టెక్నికల్ ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించి, విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించిన సాంకేతిక సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ పర్యటనలో సంబంధిత రెవెన్యూ, సర్వే, ఇంజినీరింగ్, ఇతర శాఖల అధికారులు, ఏఏఐ సాంకేతిక ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు