సెలవుల్లో బడులు నడిపే యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి
విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి
నిబంధనలు మీరితే ప్రత్యక్ష ఆందోళనలు
ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్
కొత్తగూడెం టౌన్,(విజయక్రాంతి): దసరా సెలవు దినాల్లో ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విద్యాసంస్థలపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం జిల్లా విద్యాశాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వరక అజిత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సెలవులను సైతం పట్టించుకోకుండా విద్యార్థులను పాఠశాలలకు రప్పించి తరగతులు నిర్వహించడం దుర్మార్గమన్నారు. సెలవుల్లోనూ తరగతులు నడపడం వల్ల విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడి పెరుగుతోందని, దీనివల్ల సెలవుల ప్రాథమిక ఉద్దేశమే దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి జిల్లావ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎంఈఓల ద్వారా అన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు సెలవు దినాల పట్టికను పంపించి ముందస్తు ఆదేశాలు జారీ చేయాలన్నారు. పాఠశాలల తీరుపై తల్లిదండ్రులు చేస్తున్న ఫిర్యాదులపై తక్షణ విచారణ జరిపించి విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తూ సెలవుల్లో పాఠశాలలను కొనసాగిస్తే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల వినయ్, జిల్లా ఉపాధ్యక్షులు కొరిమి సంజయ్, జిల్లా సమితి సభ్యులు జుంజునూరి రాజ్ కమల్, నాయకులు దినేష్ తదితరులు పాల్గొన్నారు.