మోదీ దిష్టిబొమ్మ దహనంపై చర్యలు తీసుకోవాలి
ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు అజ్మీరా సురేష్ నాయక్‌పై కేసు నమోదు చేయాలని బీజేపీ ఫిర్యాదు
టేకులపల్లి (విజయక్రాంతి): దసరా సందర్భంగా కొత్తగూడెంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిమను రావణాసురుడితో పోలుస్తూ దహనం చేశారనే ఆరోపణలపై ఎన్ఎస్యూఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు అజ్మీరా సురేష్ నాయక్‌తో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టేకులపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు తేజావత్ శంబు నాయక్, జిల్లా కార్యదర్శి బోడా పుణ్య నాయక్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు ఫిర్యాదు అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రధాని మోదీని రావణాసురుడితో పోలుస్తూ ప్రతిమను దహనం చేయడం కోట్లాది మంది హిందువుల మనోభావాలను కించపరిచే చర్యగా భావిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ, ఇతరుల మనోభావాలను దెబ్బతీసే చర్యలపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి బోడా పుణ్య నాయక్, గిరిజన మోర్చా జిల్లా నాయకుడు రవి రాథోడ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు తరావత్ బాలాజీ నాయక్, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బోడా గంగానాయక్, మండల ప్రధాన కార్యదర్శి బోడా నవీన్ నాయక్, సీనియర్ నాయకుడు చిక్కా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.