కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
కేంద్ర మంత్రి పదవికి ఎల్.మురుగన్ రాజీనామా
న్యూఢిల్లీ: కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేత, కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్(Union Minister L.Murugan) తన మంత్రి పదవితో పాటు రాజ్యసభ(Rajya Sabha) సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన నిర్ణయాన్ని తెలియజేస్తూ లేఖ పంపించారు.
తమిళనాడులో బీజేపీ(BJP)ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు మురుగన్ వెల్లడించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కేంద్రంలో సమాచార, ప్రసార శాఖతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి(Minister of State for Parliamentary Affairs)గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2021లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన మురుగన్, 2024లో మరోసారి ఎగువ సభకు ఎన్నికయ్యారు.
తమిళనాడులో బీజేపీ బలోపేతానికి పూర్తి సమయం కేటాయించాలనే ఆయన నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.