మంథని అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

13-10-2026 | 06:53pm

గోదావరి పుష్కర ఘాట్‌ పనులు 10 రోజుల్లో ప్రారంభించాలి

మార్చి 2027 నాటికి సమీకృత కార్యాలయ భవనం పూర్తి చేయాలి

మంథనిలో విస్తృత పర్యటనలో కలెక్టర్ కోయ శ్రీహర్ష

మంథని (విజయక్రాంతి): మంథని ప్రాంతంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(Collector Koya Sriharsha) అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని, నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. 

మంగళవారం కలెక్టర్ మంథని పట్టణంలో గోదావరి పుష్కర ఘాట్ వద్ద రహదారి నిర్మాణ పనులు, మంథని–రామగుండం రహదారిపై హెలిప్యాడ్, సమీకృత డివిజన్ కార్యాలయాల భవనం, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రామగిరి మండలం పన్నూరు క్రాస్‌రోడ్డు వద్ద జరుగుతున్న రహదారి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు.

పుష్కర ఘాట్‌ రహదారి పనులకు గడువు

గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పుష్కర ఘాట్ వద్ద రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మరో పది రోజుల్లోగా కాంక్రీట్ పనులు ప్రారంభించాలని, రహదారి నిర్మాణానికి సంబంధించిన నమూనాలను నాలుగు రోజుల్లోగా ఖరారు చేయాలని సూచించారు. అవసరమైన నిర్మాణ సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని, రహదారి పనులకు అడ్డుగా ఉన్న చెట్లు, పొదలను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. పనులకు ఆటంకంగా ఉన్న సమస్యలను ఆర్డీవో వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

పుష్కరాల సమయంలో భక్తులు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి నాణ్యతతో నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. మంథని–రామగుండం రహదారిపై ఉన్న హెలిప్యాడ్‌ను పుష్కరాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని తెలిపారు.

మార్చి 2027 నాటికి కార్యాలయ భవనం పూర్తి

మంథనిలో నిర్మిస్తున్న సమీకృత డివిజన్ కార్యాలయాల భవనాన్ని మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్మాణ పనులకు అవసరమైన అదనపు నిధుల ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులోగా భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

50 పడకల ఆసుపత్రి నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం

మంథనిలో నిర్మాణంలో ఉన్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను పరిశీలించిన కలెక్టర్, భవన నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణ నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సదుపాయాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

రోడ్లు, మున్సిపల్ భవన పనులు త్వరగా పూర్తి చేయాలి

రామగిరి మండలం పన్నూరు క్రాస్‌రోడ్డు వద్ద జరుగుతున్న రెండు వరుసల రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని తెలిపారు.

మంథని మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులు ఇప్పటికే అధిక శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో రహదారులు, భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ భావ్ సింగ్, ఆర్డీవో సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు