భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రీ-సర్వే
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూర్ (విజయక్రాంతి): భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు భూముల హద్దులను పక్కాగా నిర్ధారించి, భూ రికార్డులలో పారదర్శకత లక్ష్యంగా ప్రభుత్వం రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) అన్నారు. మంగళవారం జిల్లాలోని చెన్నూరు మండలం కోనంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సమగ్ర భూ సర్వే అవగాహన సదస్సుకు మండల తహసిల్దార్ మల్లికార్జున్, అధికారులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వేలో భాగంగా జిల్లాలోని ప్రతి మండలంలో తొలి విడతగా 2 గ్రామాలను ఎంపిక చేసి ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పాత భూ రికార్డులలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, భూముల విస్తీర్ణం, హద్దులు, యాజమాన్య వివరాలకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.
కొన్ని సందర్భాలలో వాస్తవంగా ఉన్న భూమి కంటే రికార్డులలో ఎక్కువ విస్తీర్ణం నమోదవడం, భూమి ఎక్కువగా ఉన్నప్పటికీ రికార్డులలో తక్కువగా నమోదవడం, భూ ఆక్రమణలు, హద్దుల వివాదాలు, గ్రామాల సరిహద్దులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని. రీ-సర్వే ద్వారా ప్రతి భూమిని క్షేత్రస్థాయిలో కొలిచి, హద్దులను సాంకేతిక పరికరాల సహాయంతో వాస్తవ విస్తీర్ణాన్ని నిర్ధారించి సంబంధిత రికార్డులు, మ్యాపులను సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు.
గ్రామాల సరిహద్దులలో ప్రభుత్వ భూములు, ఇతర భూముల ఆక్రమణలకు సంబంధించిన సమస్యలను రీ-సర్వే ద్వారా గుర్తించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రీ-సర్వే నిర్వహించే తేదీకి సంబంధించి భూయజమానులకు ముందుగానే నోటీసులు అందజేయడం జరుగుతుందని, భూముల కొలతలు నిర్వహించే తేదీకి కనీసం వారం రోజుల ముందే సమాచారం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నోటీసులో పేర్కొన్న తేదీన భూయజమానులు తప్పనిసరిగా తమ భూముల వద్ద అందుబాటులో ఉండాలని, వాస్తవ హద్దులను సర్వే సిబ్బందికి చూపించి, రికార్డులలో నమోదైన విస్తీర్ణం, క్షేత్రస్థాయిలో ఉన్న విస్తీర్ణాన్ని పరిశీలించుకోవాలని తెలిపారు. రీ-సర్వే పూర్తయిన అనంతరం ప్రతి భూమికి సంబంధించిన హద్దులు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలతో మ్యాపులు రూపొందిస్తామని, భవిష్యత్తులో భూముల క్రయవిక్రయాలు జరిగినప్పుడు సంబంధిత రికార్డులు, మ్యాపుల ఆధారంగా భూమి బదిలీ వివరాలను నమోదు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
తద్వారా భూముల హద్దుల విషయంలో తలెత్తే వివాదాలను తగ్గించడంతో పాటు, భూముల యాజమాన్య వివరాలను స్పష్టంగా నిర్వహించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. భూముల రికార్డుల నిర్వహణ మరింత పారదర్శకంగా మారుతుందని తెలిపారు. భూయజమానుల సహకారం ఉంటే నిర్ణీత సమయంలో సర్వే పూర్తి చేసి, సంబంధిత మ్యాపులను సిద్ధం చేయడంతో పాటు, నిబంధనల ప్రకారం కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల జారీకి చర్యలు తీసుకోవచ్చని తెలిపారు.
జిల్లాలోని నెన్నెల మండలంలోని 2 గ్రామాలలో, తాండూరు మండలంలోని రాంపూర్ గ్రామంలో రీ-సర్వే నిర్వహించగా, సుమారు 95 శాతం వరకు సమస్యలు పరిష్కారమయ్యాయని, వారసత్వంగా వచ్చిన భూముల పంపకం, కుటుంబ సభ్యుల మధ్య భూముల వాటాల విషయంలో ఒప్పందాలు లేకపోవడం వంటి కొన్ని సమస్యలు మినహా, అనేక భూ వివాదాలను పరిష్కరించేందుకు రీ-సర్వే దోహదపడిందని తెలిపారు.
అంతకుముందు మండల కేంద్రంలో కొనసాగుతున్న వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను పరిశీలించి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. గోదావరి పుష్కర ఘాట్ పనులను మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ తో కలిసి పరిశీలించి పనులు వేగవంతం చేయాలని తెలిపారు.
చెన్నూర్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అమృత్ 2.0 పథకం పనులను పరిశీలించి పనులను వేగవంతం చేసి ప్రతి ఇంటికి నిరంతరం త్రాగునీరు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండలంలోని సోమనపల్లి లో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.