పాడైన ఆహారమే విక్రయమా..? ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా..?
బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం సారపాకలోని ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలు, కర్రీ పాయింట్లలో నాణ్యతలేని ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో చేపల కూరలో పురుగులు ఉన్నాయంటూ వివాదం (Food Safety Concern) చోటుచేసుకోగా, తాజాగా ఓ కర్రీ పాయింట్‌లో కొనుగోలు చేసిన పెరుగు చట్నీ పాడైందని సుందరయ్య కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఆరోపించారు.
ఇంట్లోని చిన్నపిల్లలు చట్నీ తిన్న తర్వాత దుర్వాసన రావడాన్ని గుర్తించి, దుకాణం వద్దకు వెళ్లి ప్రశ్నించగా వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. అనంతరం బాధితుడు బూర్గంపాడు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా ఆహార పదార్థాల నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది (Food Quality).
తనిఖీలు చేపట్టాలి
ఆహార పదార్థాల నాణ్యతను పర్యవేక్షించాల్సిన సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు (Food Inspections) చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల్లో పరిశుభ్రత పాటిస్తున్నారా? గడువు ముగిసిన పదార్థాలను వినియోగిస్తున్నారా? అనే అంశాలను పరిశీలించాలని సూచిస్తున్నారు.
ప్రజారోగ్యానికి ముప్పు కలగకుండా ఆహార భద్రత అధికారులు స్పందించి, ఆరోపణలపై విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు (Public Health).