ముక్కిపోయిన రేషన్ బియ్యం

22-10-2026 | 05:25am
  1. అధికారుల ఉదాసీనత 
  2. కిస్మత్పూర్ గోదాములో ‘కోట్ల’ సొమ్ము బూడిదలో పోసిన పన్నీరేనా?

రాజేంద్రనగర్, అక్టోబర్ 21(విజయక్రాంతి):ప్రభుత్వ నిధులు(Government funds) దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అధికారుల నిర్లక్ష్యం, బ్యూరోక్రసీ అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని కిస్మత్పూర్ సివిల్ సప్లైస్ స్టేజ్-2 గోదాం అధికారుల భ్రష్టత్వానికి, పర్యవేక్షణ లోపానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెం ట్ అధికారులు పట్టుకున్న రూ. కోట్లాది విలువైన ప్రజాధనం, కేవలం గోదాముల్లో మగ్గిపోతూ వ్యర్థంగా మారిపోతోంది.

మూడు ఏళ్లుగా కదలని నిల్వలు....కుళ్ళిపోయిన 10,000 క్వింటాళ్లు:

గండిపేట, మొయినాబాద్, శేర్లింగంపల్లి, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో అక్రమ ర వాణా అవుతూ పట్టుబడిన సుమారు 10, 000 క్వింటాళ్ల దొడ్డు (రేషన్) బియ్యాన్ని అధికారులు కస్టడీ కింద కిస్మత్పూర్ స్టేజ్-2 గోదాములో ఉంచారు. అయితే గత మూడేళ్లుగా సకాలంలో లీగ ల్ ప్రాసెస్ పూర్తి చేసి వేలం వేయకపోవడం తో, ఆ బియ్యమంతా పురుగులు పట్టి, ము క్కిపోయి పూర్తిగా కుళ్ళిపోయింది.

భరించలేని దుర్వాసన.....

వేలాది క్వింటాళ్ల బియ్యం కుళ్ళిపోవడం తో గోదాం చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రమైన కంపు కొడుతోంది. దారిన పోయే కాలనీవాసులు, వాహనదారులు ముక్కులు మూసుకుని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. దోమలు, పురుగులు ఈగలు పెరి గిపోవడంతో డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాపిస్తాయని పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

లబోదిబోమంటున్న హమాలీలు:

10,000 క్వింటాళ్ల సామర్థ్యం ఉన్న గోదాం అంతా ఈ పాడైపోయిన పాత నిల్వలతోనే నిండిపోవడంతో కొత్త సరుకు దించ డానికి బొత్తిగా స్థలం లేదు. దీంతో ప్రతి నెలా నిరుపేదల రేషన్ కోసం స్టేజ్-1 నుండి వచ్చే బియ్యాన్ని గోదాములో నిల్వ చేయలేక, నేరుగా లారీల్లో నుంచే హమాలీలు ఇతర వాహనాల్లోకి షిఫ్ట్ చేయాల్సి వస్తోంది. దీనివల్ల వర్షం పడితే సరుకు తడిసిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది.

 స్పందించని ఇన్చార్జ్.....

ప్రభుత్వ ఆస్తి కళ్ల ముందే నాశనమవుతున్నా ఉన్నతాధికారుల్లో మాత్రం చలనం లేదు. ఈ విషయమై కిస్మత్పూర్ సివిల్ సప్లైస్ గోదాం ఇన్చార్జ్ భార్గవ రెడ్డిని వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ప్రజాధనం ఇలా అధికారుల అలసత్వం వల్ల వీధుల పాలవుతోంది. 

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు సివిల్ సప్లైస్ ఉన్నతాధికా రులు తక్షణమే జోక్యం చేసుకోవాలి. ముక్కిపోయిన ఈ బియ్యానికి సత్వరమే ఇ-వేలం నిర్వహించి గోదామును ఖాళీ చేయించాలి. రాబోయే కొత్త రేషన్ సరఫరాకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు