పూసపల్లి ఓసీ పనులు నెలలో ప్రారంభించాలి
సహకరించకుంటే ప్రజలతో కలిసి ఉద్యమం: హరిప్రియ
ఎమ్మెల్యే కనకయ్యపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): పూసపల్లి ఓపెన్‌కాస్ట్, కోయగూడెం కేఓసీ పిట్-3 పనులు ఆలస్యం కావడానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Kanakaiah) ఆయన అనుచరులే కారణమని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బానోత్ హరిప్రియ(Former MLA Banoth Haripriya) ఆరోపించారు. పూసపల్లి ఓసీ ప్రారంభానికి అవసరమైన గ్రామసభ తీర్మానం ఇవ్వకుండా అడ్డుకోవడంతో పాటు, భూనిర్వాసితుల జాబితా విషయంలోనూ ఎమ్మెల్యే చేస్తున్న డిమాండ్ల వల్ల ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. పూసపల్లి ఓసీ భూ సర్వేలో(Poosapalli OC land survey) 261.33 ఎకరాల అటవీ భూమి ఉండగా, అందులో 157.33 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలిపారు.
అలాగే పూసపల్లి ఓసీ, కోయగూడెం కేఓసీ పిట్-3 పరిధిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఆయన కుటుంబ సభ్యులు సుమారు 100 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అటవీ, రెవెన్యూ, సింగరేణి సర్వే నివేదికలు తన వద్ద ఉన్నాయని, అవసరమైన సమయంలో వాటిని బహిర్గతం చేస్తానన్నారు. ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన 12 ఇళ్ల పత్రాలు కూడా తన వద్ద ఉన్నాయని, ఈ అంశంపై ఎమ్మెల్యేతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని హరిప్రియ సవాల్ చేశారు. స్థలం, తేదీ, సమయం ఎమ్మెల్యే ప్రకటించాలని కోరారు. నెల రోజుల్లో పూసపల్లి ఓసీ, కోయగూడెం కేఓసీ పిట్-3 పనులు ప్రారంభించేందుకు ఎమ్మెల్యే సహకరించకుంటే సింగరేణి యాజమాన్యంతో కలిసి ఇల్లందు నియోజకవర్గ ప్రజలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హరిప్రియ హెచ్చరించారు.
