24 గంటల్లో మిస్సింగ్ బంగారం రికవరీ
ఫిర్యాదు నుంచి రికవరీ వరకు.. 24 గంటల్లోనే ముగిసిన కేసు
పటాన్ చెరు: పటాన్‌చెరు పరిధిలో మిస్సింగ్ అయిన బంగారు ఆభరణాల కేసును పటాన్‌చెరు పోలీసులు(Patancheru Police) వేగంగా విచారించి కేవలం 24 గంటల్లోనే ఆచూకీ కనుగొని బాధితుడికి అప్పగించారు. ఫిర్యాదు అందిన వెంటనే పటాన్‌చెరు క్రైమ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆసిఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. సంబంధిత వ్యక్తుల వివరాలు, ఆధారాలను పరిశీలించి మిస్సింగ్ అయిన బంగారు ఆభరణాలను గుర్తించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకుని బాధితుడికి అప్పగించారు.
ఈ సందర్భంగా బాధితుడు పోలీసుల తక్షణ స్పందన, సమర్థవంతమైన దర్యాప్తుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా కేవలం 24 గంటల్లోనే బంగారు ఆభరణాలను గుర్తించి తిరిగి అప్పగించిన క్రైమ్ ఎస్‌ఐ ఆసిఫ్ చొరవ, నిబద్ధత, వేగవంతమైన చర్యలను ప్రశంసిస్తూ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజలు తమ విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. పటాన్‌చెరు పోలీసుల వేగవంతమైన చర్యలపై వినోద్ కుమార్, బాలు యాదవ్ హర్షం వ్యక్తం చేస్తూ పోలీసు శాఖ పనితీరును అభినందించారు. ప్రజల ఆస్తుల రక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని అధికారులు తెలిపారు.
