కోనరావుపేటకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు

08-09-2026 | 12:06am

నాణ్యమైన విద్యకు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు: విప్ ఆది శ్రీనివాస్

కోనరావుపేట,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను అభివృద్ధి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Vemulawada MLA Aadi Srinivas) అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండల(Konaraopet Mandal) కేంద్రానికి మంజూరు చేసినట్లు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత తరగతుల వరకు సమగ్ర విద్య అందించేలా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను(Telangana public school) తీర్చిదిద్దుతున్నట్లు విప్ పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు డిజిటల్ తరగతి గదులు, ఆధునిక సైన్స్ ల్యాబొరేటరీలు, గ్రంథాలయాలు, కంప్యూటర్ సదుపాయాలు, క్రీడా వసతులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. చదువుతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలు, క్రీడా ప్రతిభను పెంపొందించేలా విద్యా విధానాన్ని రూపొందిస్తున్నట్లు ఆది శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యా వాతావరణం కల్పించడమే తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ప్రధాన ఉద్దేశమన్నారు.

రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా పాఠశాలల్లో మరమ్మతులు, మౌలిక వసతుల కల్పన చేపట్టామని, వేములవాడ నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. కోనరావుపేట మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు