సామాన్య రైతులా మంత్రి తుమ్మల
- చేత కర్ర భూని మోటార్ సైకిల్ పై ప్రయాణం
- దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి తుమ్మల
దమ్మపేట, నవంబర్ 06(విజయక్రాంతి): మురసు తుఫాన్(Cyclone Murasu) ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు, పంటలు దెబ్బతినడంతో జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించేందుకు వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Dammapeta Mandal) ఒక సామాన్య రైతులా చేత కర్ర భూని తన అనుచరుడు కాసాని నాగప్రసాద్ మోటార్ సైకిల్ పై స్వయంగా పరిశీలించారు.
ఇటీవల కురిసిన మురసు తుఫాన్, కుండపోత వర్షాలకు దమ్మపేట మండలంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా దురదపాడు, గండుగులపల్లి గ్రామాల పరిధిలో మల్లెపూల వాగు ఉప్పొంగి రోడ్లు కొట్టుకుపోవడంతో పాటు, వరి పంట సుమారు 12 వందల ఎకరాల్లో పూర్తిగా నీటమునిగింది. ఈ వర్షపు నష్టానికి సంబంధించి మండల అధికారులు ప్రాథమిక సర్వే పూర్తి చేసి, ప్రభుత్వానికి తుది నివేదికలు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కేవలం అధికారుల నివేదికలపైనే ఆధారపడకుండా, రైతుల వాస్తవ పరిస్థితులను తన కళ్లతో
చూసేందుకు మంత్రి తుమ్మల స్వయంగా రంగంలోకి దిగారు. ముంపునకు గురైన పంట పొలాల వద్దకు, మల్లెపూల వాగు సమీపానికి కార్లు వెళ్లే మార్గం లేకపోవడంతో, బురద రోడ్లను, కొట్టుకుకుపోయిన రోడ్లను సైతం లెక్కచేయకుండా, మంత్రి తుమ్మల ద్విచక్ర వాహనంపై ప్రయాణించారు. గుంతలు పడి, బురదమయంగా మారిన రోడ్ల గుండా ప్రయాణించి దెబ్బతిన్న మల్లెపూల వాగు మార్గాన్ని, నీట మునిగిన వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మంత్రి తుమ్మలతో మాట్లాడుతూ తమకు మురసు తుఫాన్ తీరని నష్టం చేకూర్చిందని, ప్రభుత్వం తమకు తగిన పరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరారు.