సురక్షితంగా దీపావళి జరుపుకుందాం
దీపావళి పండుగకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా సూచనలు
ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ 108 స్టేట్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ బి. సుధాకర్
ఘట్ కేసర్, నవంబర్ 6 (విజయక్రాంతి) : సురక్షితంగా దీపావళి పండుగను(Festival of Diwali) జరుపుకుందామని ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్(EMRI Green Health Services) (జిహెచ్ఎస్) 108 స్టేట్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ బి. సుధాకర్(B. Sudhakar) పండుగకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా సూచనలను శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలియజేశారు.
దీపావళి అనేది దేశవ్యాప్తంగా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే దీపాల పండుగని, అయితే చిన్నపాటి నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగా ఈ ఆనందకరమైన పండుగ ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా బాణసంచా పేల్చే సమయంలో అగ్నిప్రమాదాలు, కాలిన గాయాలు, ఇతర ప్రమాదాలు సంభవించవచ్చని కావున తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చన్నారు.
ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో అంబులెన్స్ సేవలను అందుబాటులో ఉంచుతూ 108 అత్యవసర సేవలు 24 గంటల పాటు ప్రజలకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అగ్నిప్రమాదాలు, కాలిన గాయాలు కంటికి సంబంధించిన కాలిన గాయాలు లేదా ఇతర అత్యవసర వైద్య పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు వెంటనే 108కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
బాణసంచా కాల్చేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు బాణసంచాను ఇళ్లలో కాకుండా విశాలమైన బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలి. ఇళ్లు, వాహనాలు, మండే స్వభావం కలిగిన వస్తువులకు దూరంగా ఉండాలన్నారు. అధిక శబ్దం వచ్చే బాణసంచాను వీలైనంత వరకు నివారించాలని, ఇది శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు చిన్నపిల్లలు, వృద్ధులకు రక్షణ కల్పిస్తుందన్నారు.
శరీరానికి సౌకర్యవంతంగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని, వదులుగా ఉండే లేదా సులభంగా మండే సింథటిక్ దుస్తులను ధరించకూడదన్నారు. బాణసంచా కాల్చేటప్పుడు తప్పనిసరిగా పాదరక్షలు ధరించాలని, చిన్నపిల్లలు పెద్దవారి పర్యవేక్షణలో మాత్రమే బాణసంచా కాల్చాలన్నారు.
అవసరమైన సందర్భాల్లో కళ్లకు రక్షణగా గాగుల్స్, మాస్క్ ధరించాలని, చేతిలో బాణసంచా పట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చకూడదని, నేలపై ఉంచి, తగినంత దూరం పాటిస్తూ కాల్చాలన్నారు. అనుకోని అగ్నిప్రమాదాలను ఎదుర్కొనేందుకు దగ్గరలో ఒక బకెట్ నీరు లేదా ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
పేలని టపాసులను తిరిగి వెలిగించే ప్రయత్నం చేయకూడదు. అగ్నిప్రమాదాలు, కాలిన గాయాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర వైద్య సహాయం కోసం 108కు కాల్ చేయాలని సూచించారు. బాధ్యతాయుతంగా, సురక్షితంగా దీపావళి పండుగ జరుపుకుందామని ఈఎంఆర్ఐ జిహెచ్ఎస్ – 108 అత్యవసర సేవల తరపున ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.