యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య.. కుటుంబంలో విషాదం

06-11-2026 | 08:31pm

పాల్వంచ, నవంబర్ 6,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ మండలంలోని నాగరం కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాగరం కాలనీకి చెందిన బానోత్ రాము(Banoth Ramu) (తండ్రి: కంతు) మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, రాము భార్య శైలజ గత సుమారు 10 నెలలుగా తన పుట్టింటిలో ఉంటున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన రాము ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మృతుడు రాముకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరికి 8 సంవత్సరాలు, మరొకరికి 5 సంవత్సరాల వయస్సు ఉంది. కుటుంబానికి ఏకైక కుమారుడైన రాము మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు