ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన వొడితల ప్రణవ్..
రోగులతో నేరుగా మాట్లాడి సమస్యలపై ఆరా
హుజురాబాద్, నవంబర్ 06 (విజయక్రాంతి): హుజురాబాద్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్(Congress leader Vodithala Pranav) అన్నారు. శుక్రవారం ఆయన హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, వైద్యులు, సిబ్బంది పనితీరు, మందుల లభ్యత తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలోని నలుమూలల నుంచి పేద, మధ్యతరగతి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తుంటారని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అండగా నిలిచి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఆసుపత్రిని సందర్శించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రోగులు తమకు ఎదురవుతున్న పలు సమస్యలను ప్రణవ్ దృష్టికి తీసుకురాగా, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ)తో మాట్లాడినట్లు వెల్లడించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందేలా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.