ముర్రేడువాగు రక్షణ గోడకు రూ. 50.50 కోట్లు
ఫలించిన ఎమ్మెల్యే కూనంనేని మూడేళ్ల కృషి
తొలగనున్న ఏళ్ల నాటి వరద ముప్పు భయాలు.
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెం, నవంబర్ 6 (విజయక్రాంతి): ముర్రేడు వాగు(Murredu Stream) వరద ముప్పునకు శాశ్వత పరిష్కారం చూపుతూ రిటైనింగ్ వాల్(Retaining wall) నిర్మాణానికి ప్రభుత్వం రూ.50.50 కోట్ల నిధులు మంజూరు చేసిందని, మూడేళ్లుగా తాను చేసిన కృషికి ఫలితం లభించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Koonamneni Sambasiva Rao) తెలిపారు. రిటైనింగ్ వాల్ నిర్మానానికి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అనుమతులు మంజూరుచేయడంతోపాటు వెనువెంటనే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) నిధులు మంజూరు ఉత్తర్వులు జారీ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ జనావాసాల మధ్య నుండి పారుతున్న ముర్రేడు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మించడంలో గత పాలకులు పూర్తిగా విఫలం చెందారని అన్నారు. ఏళ్ల తరబడి ముర్రేడు వాగు ఉధృతి వల్ల శ్రీనగర్, ప్రశాంతి నగర్, సాయినగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, భారీ వర్షాలకు వరద నీరు ఇండ్లలోకి చేరి ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపారని గుర్తుచేశారు. గత పాలకులు ఈ సమస్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో దశాబ్దాలుగా ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీశారని పేర్కొన్నారు.
శ్మశాన వాటికలకు వెళ్లే మార్గాలు సైతం మునిగిపోయి ప్రజలు నరకయాతన అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బాధలను గుర్తించి ట్రైనింగ్ వాల్ నిర్మాణమే శాశ్వత పరిష్కారమని, అందుకోసం మంత్రులపై వత్తిడి తెచ్చి సాధించానన్నారు. నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కట్టుబడి ఉంటానని కూనంనేని స్పష్టం చేశారు.