విజయక్రాంతి కథనానికి స్పందన
రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించిన ఆర్గనైజర్
విజయ క్రాంతికి కృతజ్ఞతలు తెలిపిన బాధిత రైతులు
పినపాక: రైతుల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేయడంలో విజయక్రాంతి(Vijayakranti) దినపత్రిక మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామానికి చెందిన రైతులు వరి విత్తనోత్పత్తి సాగుచేసిన క్రమంలో సరైన దిగుబడి రాక నష్టపోయారు. ఈ క్రమంలో విత్తన ఉత్పత్తి సాగు చేయించిన ఆర్గనైజర్ నష్టపరిహారం బకాయిల చెల్లింపులో కాలయాపన సమస్యపై ఈ నెల 18న విజయక్రాంతి దినపత్రికలో ప్రచురితమైన ‘తాతారావు సారే.. న్యాయం చేయాలి’ కథనానికి స్పందన లభించింది.
రైతులకు అందాల్సిన బీమా పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతున్న విషయాన్ని విజయక్రాంతి పత్రిక తన కథనం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చింది. రైతుల సమస్యను సంబంధిత ఆర్గనైజర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, రైతులకు న్యాయం జరిగేలా పత్రిక ప్రతినిధులు నిరంతరం కృషి చేశారు. ఈ కథనంపై స్పందించిన ఆర్గనైజర్ ఆర్‌కే, విజయక్రాంతి పినపాక మండల రిపోర్టర్ అత్తె లక్ష్మీనారాయణతో కలిసి రైతులను స్వయంగా కలిశారు.
రైతులు అందించిన ఆధారాలను పరిశీలించిన అనంతరం, కంపెనీ నుంచి రైతులకు చెల్లించాల్సిన బీమా బకాయిలను ఇప్పించేందుకు చర్యలు చేపట్టారు. చివరకు రైతులకు అందాల్సిన బీమా మొత్తాన్ని విత్తనోత్పత్తి సాగు చేయించిన ఆర్గనైజర్ పూర్తిగా చెల్లించారు. దీంతో తమ సమస్యను పత్రిక ద్వారా వెలుగులోకి తీసుకువచ్చి, బీమా బకాయిలు అందేలా కృషి చేసిన విజయక్రాంతి దినపత్రికకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా విజయక్రాంతి దినపత్రిక యాజమాన్యానికి, పినపాక మండల రిపోర్టర్ అత్తె లక్ష్మీనారాయణ, విత్తన ఉత్పత్తి కంపెనీ నుండి బీమా డబ్బులు చెల్లించేలా కృషిచేసిన ఆర్గనైజర్ ఆర్‌కేలకు రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం పత్రిక వేదికగా చేసిన కృషిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో సబ్‌ఆర్గనైజర్ కోడూరి నరసింహారావు, ఫీల్డ్ అసిస్టెంట్ నాగరాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.