పరిహారంలో భూమి ఇచ్చారు.. పట్టా మరిచారు..!
- కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం శూన్యం
- సింగరేణి యాజమాన్యం దాస్టికం
- న్యాయం చేయాలంటూ మహిళ ఆవేదన
మణుగూరు, నవంబర్ 1 (విజయక్రాంతి): సింగరేణి(Singareni) విస్తరణలో భాగంగా సర్వం కోల్పోయిన బాధితులకు అండగా ఉంటామని సింగరేణి సంస్థ భరోసా ఇస్తూ నిర్వాసితుల నుండి భూములు తీసుకున్నప్పటికీ ఇచ్చిన పరిహారంలో పూర్తిగా మొండి చేయి చూపెడుతున్నారు. నిర్వాసితుల నుండి భూమి తీసుకునేటప్పుడు అన్ని విధాలా చూసుకుంటామని చెప్పి భూములు కోల్పోయాక పరిహార విషయంలో సింగరేణి సంస్థ నిర్వాసితులకు తీవ్రమైన అన్యాయం చేస్తుంది.
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని మల్లేపల్లిలోని పాత కొమ్ముగూడెం గ్రామ ప్రాంతాన్ని మణుగూరు సింగరేణి సంస్థ విస్తరణ కోసం నిర్వాసితుల నుండి భూములు తీసుకుంది. కానీ పరిహార విషయంలో తీవ్రమైన అన్యాయం చేశారంటూ ఆదివాసి మహిళ ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ ప్రాంతానికి చెందిన గనిబోయిన లక్ష్మి 11 సంవత్సరాల క్రితం సింగరేణి విస్తరణ కోసం భూములు కోల్పోయామని తెలిపారు. పరిహార విషయంలో సింగరేణి సంస్థ తీవ్రమైన అన్యాయం చేయడం వల్ల అన్ని విధాల నష్టపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది.
పరిహారంలో భూమికి బదులుగా భూమిని ఎంచుకున్నప్పటికీ సింగరేణి సంస్థ ఎకరం భూమిని కేటాయించింది. ఈ ఎకరం భూమి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు విషయంలో తమకేమీ సంబంధం లేదంటూ సింగరేణి యాజమాన్యం అన్యాయం చేసిందని వాపోయింది.
తనతో పాటు భూమి కోల్పోయిన మరో మహిళకు భూమి ఇవ్వడంతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేశారని తెలిపారు. కానీ తనకి కేటాయించిన భూమికి సంబంధించి పాస్ పుస్తక విషయంలో తాసిల్దార్ కార్యాలయం చుట్టూ సంవత్సరాల నుండి తిరుగుతున్న న్యాయం జరగడం లేదని వాపోయింది. తహసీల్దార్లు మారుతున్నారు కానీ ఎవరు కూడా న్యాయం చేయడం లేదని పట్టాదారు పాస్ పుస్తకం లేక రైతుబంధు, లోన్లు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ప్రభుత్వం స్పందించి తనకు కేటాయించిన భూమికి పట్టాదార్ పాస్ పుస్తకం మంజూరు చేయాలని వేడుకుంటుంది.