జనసంద్రంగా యాదగిరి గుట్ట..

01-11-2026 | 10:59pm

వేద నాదంతో పులకరించిన యాదగిరి కొండ......

యాదగిరిగుట్ట, నవంబర్ 1 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Sri Lakshmi Narasimha Swamy Temple) వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు కావడంతో కొండ కింద వాహనాలతో రింగ్ రోడ్డు క్రిక్కిరిసిపోయింది. స్వామివారి నిత్య పూజలు పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.  స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. కొండపైన  పురవీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. వేదనాదంతో యాదగిరి కొండ పులకరించింది.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో  భక్తిశ్రద్ధల నడుమ విశేషంగా వేద స్వస్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో నిర్వహించిన ఈ మహత్తర వేడుకలో సుమారు 550 మంది వేద విద్యార్థులు, వారి గురువులు పాల్గొని ఏకకాలంలో వేద స్వస్తి పలికారు.

చతుర్వేదాలైన రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలలోని పవిత్ర మంత్రాలను విద్యార్థులు, అధ్యాపకులు ఘనంగా పఠించారు. శ్రావ్యమైన మంత్రోచ్ఛారణలతో ఆలయ ముఖ మండపం, ప్రాకారాలు మార్మోగాయి. స్వామివారి దర్శనార్థం విచ్చేసిన భక్తులు ఈ దివ్యమైన వేద నాదాన్ని విని పరవశించిపోయారు. లోకకళ్యాణం, సమాజ శ్రేయస్సు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

ఈ కార్యక్రమంలో దేవస్థాన ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, వేద పండితులు శ్రీనివాస్ శర్మ, ఆలయ కార్యనిర్వాహణాధికారి భవాని శంకర్,డీఈఓ భాస్కర్ శర్మ, ఆలయ ఏఈఓ సురేందర్ రెడ్డి, ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు