జిల్లా కేంద్రంలో ఈపీఎఫ్ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి
ఎంపీని కలిసిన బిజెపి కార్మిక విభాగం
జగిత్యాల, నవంబర్ 01 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ, కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ కట్ట విజయ్ కుమార్ బృందం ఆదివారం నిజామాబాద్ ఎంపీ పలు అభివృద్ధి కార్యక్రమాలపై జగిత్యాలలో పర్యంటించిన సందర్భంగా బీజేపీ లేబర్ సెల్ జిల్లా కన్వీనర్ కట్ట విజయ్ కుమార్ నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Arvind)కు వినతిపత్రం అందజేశారు. జగిత్యాల జిల్లాలో బీడీ పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది మహిళా బీడీ కార్మికులు, ప్యాకర్లు, చాటింగ్, బట్టీ కార్మికులు, కమిషన్ ఏజెంట్లు జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
ముఖ్యంగా మహిళా బీడీ కార్మికులు చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితం గడుపుతూ కుటుంబాలకు ఆర్థిక భరోసాకల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈపీఎఫ్ఓ 1995 చట్టం ప్రకారం 58 ఏళ్లకు విరమణ పొంది పెన్షన్ పొందుతున్నారని, అది కేవలం రూ.2000 మాత్రమే వస్తోందన్నారు. 50 ఏళ్లకే పెన్షన్ తీసుకుంటే 8 సంవత్సరాలు ముందుగా తీసుకున్నందుకు సంవత్సరానికి 4 శాతం చొప్పున 32 శాతం కోత విధించి కేవలం రూ.1320 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ఇది ఏ మాత్రం సరిపోవడం లేదని, కనీస పెన్షన్ రూ.5000కు పెంచాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా పెన్షన్ సమయంలో, సర్వీసులో ఉండి మరణించిన కార్మికులకు ఎఫ్ ఎం సి, డెత్ సర్టిఫికెట్, జాయింట్ సర్టిఫికెట్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ రీజినల్ కమిషనర్ కార్యాలయాలు కరీంనగర్, నిజామాబాద్ లో మాత్రమే ఉండటం వల్ల జగిత్యాల జిల్లా బీడీ కార్మికులు, ఇతర రంగాల కార్మికులు కుటుంబాన్ని, పనిని వదిలి తరచూ అక్కడికి వెళ్లాల్సి వస్తోందని, ఇది సమయం, ఆర్థిక భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో పీఎఫ్ కార్యాలయం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ లేబర్ సెల్ కో-కన్వీనర్ బండారి ప్రభాకర్, బండారి గంగారెడ్డి, హనుమాండ్లు, గంగారం, లక్కం సంజీవ్, తోగిటి అంజయ్య, భారతపు, లింగారెడ్డి, కమిషన్ ఏజెంట్లు గంగాధర్, రమేష్, బీడీ కార్మికులు సుధా, పద్మ, రాధిక, సుజాత, సబియా బేగం, మమత, ఎల్.రాధిక, రాధమ్మ, ఆసియా బేగం, పర్వీన్ సుల్తానా, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.