నాలుగు మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులకు శిక్షణ
- 28న పినపాకలో శిక్షణ కార్యక్రమం
- వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికపై అవగాహన
- ఉపాధి హామీ పథకం సంస్కరణలపై శిక్షణ
మణుగూరు, సెప్టెంబర్ 27, (విజయక్రాంతి): పినపాక నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులకు ఈనెల 28న శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పినపాక మండలం(Pinapaka Mandal)లోని, ఏడుల్లా బయ్యారం క్రాస్ రోడ్డు లోని జి.వి.ఆర్. ఫంక్షన్ హాల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుందని పత్రిక ప్రకటన లో తెలిపారు.
ఈ శిక్షణకు పినపాక, కరకగూడెం, అశ్వాపురం, మణుగూరు మండలాలకు చెందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఉపాధి హామీ పథక సిబ్బంది హాజరుకానున్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళిక రూపకల్పనపై శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామస్థాయిలో అభివృద్ధి అవసరాలను గుర్తించి సమగ్ర ప్రణాళికలను రూపొందించే విధానంపై ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన కల్పించనున్నారు. అలాగే ఉపాధి హామీ పథకంలో చేపట్టిన సంస్కరణలు, మార్గదర్శకాలు, పథకం పేరులో మార్పు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సంబంధిత నాలుగు మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ణీత సమయానికి హాజరై శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.