ఘనపురం ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

27-09-2026 | 10:10pm

రూ.2 కోట్లతో అభివృద్ధికి చర్యలు: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి మండలం సెప్టెంబర్ 27 : ఘనపురం ఖిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి(Wanaparthy MLA Tudi Megha Reddy) తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పర్యాటక శాఖ(District Tourism Department) ఆధ్వర్యంలో ఖిల్లాఘణపురం మండలంలోని ఘనపురం ఖిల్లా వద్ద నిర్వహించిన ట్రెక్కింగ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో(District Collector Adarsh ​​Surabhi) కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఘనపురం ఖిల్లాకు ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందని, ఇక్కడి కట్టడాలు పూర్వీకుల నిర్మాణ నైపుణ్యానికి, దూరదృష్టికి నిదర్శనమన్నారు. వనపర్తి జిల్లాలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి మరింత గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.ఘనపురం ఖిల్లా అభివృద్ధికి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చించామని, సుమారు రూ.2 కోట్ల నిధులతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడాల్సి ఉందని, అనుమతులు వచ్చిన వెంటనే అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. ఘనపురం ఖిల్లాను ప్రత్యేక గుర్తింపు కలిగిన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు.విద్యార్థులు చదువుతో పాటు చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదపై అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని, వారి అవసరాలకు అనుగుణంగా పలు సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.

పర్యాటక ప్రాంతాలను ప్రజలకు పరిచయం చేయడమే లక్ష్యం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో చారిత్రక ప్రాధాన్యతతో పాటు ప్రకృతి అందాలతో కూడిన అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. వాటి విశిష్టత, చారిత్రక నేపథ్యం, ప్రకృతి సౌందర్యాన్ని ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు.ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులు, యువతలో చరిత్రపై ఆసక్తి పెరుగుతుందని, పర్యాటక ప్రాంతాలకు మరింత ప్రాచుర్యం లభిస్తుందని అన్నారు.

పోటీల్లో విజేతలకు బహుమతులుప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి బహుమతులు అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా యువజన క్రీడలు, పర్యాటక శాఖ అధికారి సుధీర్ రెడ్డి, సీపీఓ హరికృష్ణ, నాయకులు సాయి చరణ్ రెడ్డి, ఆగారం ప్రకాష్, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు