నిమజ్జనం వేళ విషాదం

23-09-2026 | 11:30am

మేదినీనగర్, (జార్ఖండ్): పండుగ సంబరాలు విషాదంగా మారుతున్నాయి. 'కరం' పండుగ(Karam festival) సందర్భంగా పూజించిన చెట్టు కొమ్మను నదిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఐదుగురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటన పాలము జిల్లాలోని చైన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోకాయా గ్రామంలో చోటుచేసుకుంది. కరం పండుగ ముగింపు కార్యక్రమంలో భాగంగా పూజించిన కరం చెట్టు కొమ్మను కోయల్ నదిలో(Koel River) నిమజ్జనం చేసేందుకు గ్రామస్థులు వెళ్లారు. ఈ క్రమంలో కొందరు ప్రమాదవశాత్తు లోతైన నీటిలోకి వెళ్లడంతో పరిస్థితి విషమించింది. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే నది వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే నీటిలో గల్లంతైన ఐదుగురిని బయటకు తీసేలోపే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

జార్ఖండ్‌లో(Jharkhand) కరం పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సర్హుల్ తర్వాత రాష్ట్రంలోని ప్రధాన గిరిజన పండుగల్లో ఒకటిగా దీనిని భావిస్తారు. ప్రకృతి, వ్యవసాయం, సోదర-సోదరీ బంధానికి ప్రతీకగా ఈ పండుగను గిరిజన సమాజాలు సంప్రదాయబద్ధంగా జరుపుకుంటాయి. పండుగలో భాగంగా కరం చెట్టును పూజించి, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివర్లో పూజించిన చెట్టు కొమ్మను నీటిలో నిమజ్జనం చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయి. అయితే అదే నిమజ్జనం(Immersion) కార్యక్రమం ఐదు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు