డంపర్‌ను ఢీకొన్న కారు.. నలుగురు స్పాట్ డెడ్
పుణ్యక్షేత్రంలో దైవదర్శనం (Temple Visit) ముగించుకుని ఇంటికి బయలుదేరిన భక్తులకు తీరని విషాదం ఎదురైంది. అప్పటివరకు ఆనందంగా సాగిన ప్రయాణం క్షణాల్లో విషాదాంతమైంది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా జైంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సర్వీస్ లేన్‌లో నిలిపి ఉంచిన డంపర్ లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
ప్రమాద సమయంలో కారులో మొత్తం తొమ్మిది మంది ఉన్నట్లు మథుర ఎస్ఎస్పీ శ్లోక్ కుమార్ వెల్లడించారు. వీరంతా రాత్రిపూట గోవర్ధన్, గిరిరాజ్ జీ పరిక్రమ పూర్తి చేసుకుని సోమవారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో సర్వీస్ లేన్‌లో ఆగి ఉన్న డంపర్‌ను కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు (Police) ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. దైవదర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి చేరుకోవాల్సిన భక్తులు రోడ్డు ప్రమాదానికి బలవడం తీవ్ర విషాదాన్ని నింపింది.