బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత(District Collector K. Haritha) పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల ముక్త్ భారత్ 100 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా రూపొందించిన గోడ ప్రతులను అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు.
18 ఏళ్లలోపు బాలికలకు, 21 ఏళ్లలోపు బాలురకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. బాల్య వివాహాల సమాచారం తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వరూప, బాలల సంరక్షణ అధికారి మహేష్, ఎయిడ్స్ స్వచ్ఛంద సంస్థ సమన్వయకర్త సంతోష్ కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.