యువతరాన్ని ఆపడం ఎవరితరం కాదు
ఇటీవల దేశంలో ఓటర్ల జాబితా సవరణ, ఓటు హక్కు పరిరక్షణ వంటి అంశాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా యువత ఈ అంశాలపై ప్రశ్నించడం, ప్రజాస్వామ్య హక్కుల కోసం ఉద్యమాల్లో పాల్గొనడం కీలక పరిణామం. ఈ చైతన్యం భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాలుగా చెప్పొచ్చు. ఈ పోరాట పటిమ గత నీట్ పేపర్ల లీకేజీ(NEET Paper leak) సందర్భంలో వెలుగు చూసింది. ఇప్పుడు ఓటు హక్కు కోసం సాగే ఉద్యమం మరో మలుపు. ఈ రెండు ఉద్యమాల్లోనూ జెన్-జి ప్రధాన పాత్ర పోషిస్తోంది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన ఓటు హక్కు. ’సర్(SIR)’ పేరుతో దేశవ్యాప్తంగా 13కోట్ల మంది ఓటు కోల్పోయారనే ఆరోపణలున్నాయి. మొత్తం నమోదైన 96.8 కోట్ల ఓట్లలో ఇది 13శా తం. -ప్రజా తీర్పుపై గణనీయ ప్రభా వమే ఉంటుంది. వీరంతా ఎక్కువ భాగం వలస కార్మికులు.నేటి యువ త (జెన్-జి) మాయమాటలను నమ్మే పరిస్థితిలో లేదు. వారిలో అసంతృప్తి తీవ్రస్థాయికి చేరింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో గెలుపు కోసం రాజ కీయ పార్టీలు తొక్కిన అడ్డదారులు తెలియంది కాదు. దీనిపై యువత మేల్కొంది. వారిలో అసంతృప్తి జ్వాలలు పెల్లుబుకుతున్నాయి.
వారిని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. అన్ని రకాల నిరంకుశ పద్ధతులను అనుసరిస్తున్నది. రాజ్యాంగాన్ని, చట్టాలను తుంగలో తొక్కింది. ఇటీవల ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు సాక్ష్యం. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో జంతర్‌మంతర్ ప్రాంగణంలోకి ఎవరూ అడుగు పెట్టకుండా మోడీ ప్రభుత్వం దిగ్బంధించింది. అయినా వేలమంది ఆంక్షలను అధిగమించి చేరుకున్నారు. దాని కొనసాగింపుగా అక్టోబర్ 10న సిజెపి, విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపునందుకొని యు వత పెద్ద ఎత్తున కదలడానికి సిద్ధమైంది.
దీన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం 35వేల మంది పోలీసులను దించింది. రైళ్ళు ఆపేసింది. 57 మెట్రో స్టేషన్లు మూసేసింది. ఇంటర్‌నెట్ కట్ చేసింది. అయినా యువత తరలివస్తుండడంతో వాళ్ళను దారిలోనే అడ్డుకొని నిర్బంధించారు. అయినా ‘చలో జంతర్‌మంతర్’ జయప్రదమైంది. బొంబాయి నుండి ఢిల్లీకి వస్తున్న సిజెపి నాయకులు అభిజిత్ దీప్కే తదితరులను రన్‌వే మీద ఉన్న విమానంలోనే అరెస్టు చేశారు. ఇలాంటి ఘటన ఇంతకుముందెన్నడూ జరగ లేదు. పన్నులు, బ్యాంకు రుణాలు చెల్లించకుండా ఎగ్గొట్టిన దొంగలను ఇలా విమానంలో అరెస్టు చేసిన ఘటన ఒక్కటి కూడా లేదు.
మాజీ ముఖ్యమంత్రులని కూడా చూడకుండా పినరయి విజయన్, మాణిక్ సర్కార్ లాంటి వారి పట్ల దురుసుగా వ్యవహరించింది. చివరకు జంతర్‌మంతర్‌లో ధర్నాలు నిషేధిస్తూ ఆర్డర్ జారీ చేసింది. చట్టాలకు, ప్రజలకు బాధ్యత వహించాల్సిన పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి తొత్తుగా మారడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం. ఆందోళన పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు పదేపదే చెబుతున్నా వీరి చెవికెక్కడం లేదు. ప్రధాన మీడియా ఈ ఉద్యమాల పట్ల శీతకన్ను వేసింది.
కానీ, యువతలో పత్రికలు చదవడం, చానెళ్లు చూడడం తగ్గింది. సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. అందువల్ల యువతరానికి వాస్తవాలు చేరకుండా నిరో ధిం చలేకపోతున్నారు. దీనిని నిరోధించడం ప్రభుత్వం, పోలీసుల వల్ల కాదు. అలా చేయాలనుకుంటే మరింత ప్రతిఘటన తప్పదు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది అయితే, ఆ హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. యువతలోని చైతన్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు కొత్త ఆశలు కలిగిస్తోంది. ప్రజల గొంతును అణచి వేయ డం ద్వారా అసంతృప్తిని తొలగించ లేరు. ప్రజల సమస్యలకు పరిష్కరించడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగ లరు. అప్పుడే దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.
వ్యాసకర్త సెల్: 9440972048
ఎన్ సీతారామయ్య