మరాఠా కోటా కొట్లాట
మరాఠా రిజర్వేషన్ల(Maratha reservations) అంశం మళ్లీ మహారాష్ట్ర రాజకీయాలను(Maharashtra politics) కుదిపేస్తున్నది. మరాఠా కోటా ఉద్యమ నాయకుడు మనోజ్ జరాంగే పాటిల్(Manoj Jarange Patil) మరోసారి నిరాహార దీక్షకు(Hunger strike) పూనుకోవడంతో ఈ అంశం తీవ్ర రూపం దాల్చింది. అయితే, తాజాగా కున్బీ కుల ధ్రువీకరణ పత్రాల(Caste certificate documents) ద్వారా ఓబీసీ కోటాలో(OBC Quota) వాటా కల్పించాలన్న డిమాండ్ తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. మరాఠా ఉద్యమం(Maratha Movement) కొత్తదేమీ కాదు. 1982లో అన్నాసాహెబ్ పాటిల్(Annasaheb Patil) నేతృత్వంలో తొలిసారి తెరపైకి వచ్చిన ఈ ఉద్యమం గత కొన్నేళ్లుగా ఉధృతమవుతూ వస్తున్నది.
2016లో కోపర్డీలో ఓ మరాఠా బాలికపై లైంగికదాడి తర్వాత విద్య, ఉద్యోగాల్లో రిజర్వే షన్లు కల్పించాలన్న డిమాండ్‌ను ఉద్యమకారులు ప్రముఖంగా ముందుకు తీసుకొచ్చారు. కోటా పోరాటం ఊపందుకోవడంతో 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు విద్యలో 12 శాతం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 13 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసింది. అయితే, 2021లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.
ఈ క్రమంలో నిజాం పాలనలోని మరాఠ్వాడా ప్రాంతానికి సంబంధించిన హైదరాబాద్ గెజిట్‌ను మరాఠా ఉద్యమకారులు తెరపైకి తీసుకురావడం ప్రాధాన్యం సంత రించుకుంది. మహారాష్ట్ర సర్కార్ సమ్మతి తెలిపిన ఈ గెజిట్ ప్రకారం కున్బీ, మరాఠా సామాజికవర్గాలు ఒకే గొడుగు కిందికి వస్తాయని, తద్వా రా ఓబీసీ రిజర్వేషన్లను తమకూ వర్తింపజేయాలని జరాంగే వాదిస్తున్నారు. కున్బీ వర్గం ఓబీసీ జాబితాలోనే ఉండటంతో న్యాయపరమైన చిక్కులు ఉండవని చెప్తున్నారు.
కాగా, ఇప్పటికే మరాఠ్వాడా ప్రాంతంలో కున్బీ వర్గంతో చారిత్రక సంబంధాలున్న మరాఠాలకు ఈ ధ్రువపత్రాన్ని సర్కార్ జారీచేస్తున్నది. అయితే, రాష్ట్ర జనాభాలో 30 శాతం ఉన్న మరాఠాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పిస్తే, తమకు అన్యాయం జరుగుతుందని ఓబీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుండటం ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
దీంతో ఒకవైపు మరాఠాల డిమాండ్, మరోవైపు ఓబీసీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన సందిగ్ధ స్థితిలో ఫడణవీస్ సర్కార్ ఉన్నది. వ్యవసాయ సంక్షోభం, యువతకు ఉపాధి లేమి వంటి సమస్యలను ప్రస్తావిస్తున్న మరాఠా సామాజికవర్గం వాదనలను విస్మరించలేం. అదే సమయంలో రాష్ట్ర జనాభాలో 50 శాతం ఉన్న ఓబీసీల అభ్యంతరాలను కొట్టిపారేయడమూ సరికాదు. ఈ సంకట స్థితిలో మహాయుతి సర్కార్ ఎలా ముందుకెళ్తుందో చూడాలి.






