5 September, 2026 | 6:54 AM

ఉద్యాన పంటలు‘సాగు’తలేదు!

05-09-2026 | 05:50am
  1. రాష్ట్రంలో కేవలం 7 శాతమే ఉద్యాన పంటల విస్తీర్ణం 
  2. పండ్లు, కూరగాయలు ఎక్కువగా పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి 
  3. రైతులను ఉద్యాన పంటల వైపు మళ్లించడంలో సర్కార్ నిర్లక్ష్యం 
  4. ఉద్యాన శాఖను వెంటాడుతున్న ఉద్యోగుల కొరత

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : తెలంగాణ రైతులు(Telangana farmers) సంప్రదాయ పంటల ఉత్పత్తి కాకుండా ఉద్యాన పంటల(Horticultural crop) వైపు మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్ నినో ప్రభావం(El Nino effect)తో తక్కువ నీరుతో ఎక్కువ ఆదాయం వచ్చే పండ్లు(fruits), కూరగాయలు(vegetables), ఆయిల్‌పామ్(oil palm) వైపు మళ్లితే రైతులకు(Farmers) అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అందుకు రైతులకు  ఉద్యాన పంటలతో లాభనష్టాలు, సాంకేతిక సహాయం, ఎరువులు(fertilizers), పురుగుమందుల సరఫరా(Pesticide supply,) వంటివా టిపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్యానవన శాఖ ప్రయత్నిస్తోంది.

ఉద్యాన పంటలపై ఒక రూపాయి పెట్టుబడి పెడితే.. రూ. 3 నుంచి రూ. 4 ఆదాయం వస్తుందని, అదే వరి, పత్తి, మిగతా వాణిజ్య పంటలపైన రూ. 1 పెట్టుబడికి కేవలం రూ. 1.25 పైసల ఆదాయం మాత్రమే వస్తుందని ఉద్యాన శాఖ అధికారులు లెక్కలతో సహా వివరిస్తున్నారు. ఈ దిశగా సర్కార్ లక్ష్యం భారీగానే ఉన్నా.. ఆచరణలో మాత్రం అమలు కావడంలేదు. రాష్టంలో వివిధ పంటల విస్తీర్ణం 132 లక్షల ఎకరాలకు పైగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది.

అందులో మేజర్‌గా వరి, పత్తి సాగు కలిపి కోటి ఎకరాలకు పైగా సాగు అవుతుంది. ఇక ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ఇప్పటివరకు కేవలం 13.50 లక్షల ఎకరాల వరకే అంటే 7 శాతానికే పరిమితమైంది. వీటిలో అయిల్‌ఫామ్ సాగు ఇప్పటివరకు 3.50 లక్షలు, కూరగాయలు 3.15 లక్షలు ఉండగా, మామిడి పంటల సాగు 3.50 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మిగతా విస్తీర్ణంలో వివిధ పండ్ల తోటలు ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఇక ఆయిల్‌ఫామ్ సాగును భవిష్యత్‌లో మరింత విర్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక పండ్ల ఉత్పత్తిలో ఒక మామిడిపండ్లు మాత్రమే ఎక్కువగా ఉత్పత్తి అవుతుండగా, మిగతా పండ్లు, కూరగాయలు  ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.

ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా కోట్లు వెచ్చించి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఉద్యాన పంటలు దాదాపు 30 శాతం వరకు పెంచితే.. తెలంగాణ ఇతర రాష్ట్రాలపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదని, రాష్ట్రంలోనే ఆదాయం గణీయంగా పెరడగానికి అస్కారం ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

సిబ్బంది కొరత..

రాష్టంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరగకపోవడానికి ఉద్యాన శాఖలో ఉద్యోగుల కొరత ఉండటమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం వెయ్యి మంది ఉద్యోగులకు పైగా ఉండాల్సిన ఉద్యాన శాఖలో.. ప్రస్తుతం 153 మంది ప్రభుత్వ ఉద్యోగులు, మరో 143 మంది  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఆశించిన మేరకు.. ఉద్యాన పంటల సాగు లక్ష్యం ముందుకు సాగడం లేదని స్పష్టమవుతున్నది.

అయితే 153 ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ 18 పోస్టుల వరకు ఖాళీగా ఉండటం, మరో 20 నుంచి 30   మంది అధికారులు  రాష్ట్ర, జిల్లా ఆఫీసులల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. ఇక పీల్డ్‌లో కేవలం 90 మంది వరకే విధులు నిర్వహించడం వల్ల.. రైతులకు ఉద్యాన పంటల ఉత్పత్తుల విషయంలో సరైన అవగాహన కల్పించడం లేదనే వాదన వినిపిస్తోంది. నియోజక వర్గానికి ఒకరు చొప్పున ఉద్యాన శాఖ అధికారులు లేకపోవడం వల్ల.. రైతులకు అందుబాటులో ఉండటం లేదని చెబుతున్నారు.

అయితే కొన్ని జిల్లాలో జిల్లా అధికారులు లేకపోవడం విశేషం. ఉద్యానవన విద్యను అభ్యసించిన వారు రాష్ట్రంలో దాదాపు 8 వేల మందికి పైగా ఉంటారని, ప్రభుత్వం ఉద్యాన శాఖలో కొత్తగా  రిక్రూట్ చేయకపోవడంతో వారంతా నిరుద్యోగులుగానే ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యాన శాఖలో కేవలం వందల్లోనే ఉద్యోగులు ఉంటే.. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో దాదాపు 4 వేల వరకు పనిచేస్తున్నారు.

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్‌తో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ వేలాది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఉద్యోగులు ఎక్కువగా ఉండటం వల్ల.. రైతులకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు ఉద్యాన పంటల వైపు రైతులను మళ్లించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

పనిభారం ఎక్కువ అవుతున్నది  

ఉద్యాన పంటలను తక్కువ నీటితో ఎక్కువ సాగు చేయడంతో పాటు రైతులకు ఆదా యం కూ డా గణనీయంగా ఉంటుంది. డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగుల కొరత ఉండటం వల్ల.. రైతులను ఉద్యాన పంటల వైపు మళ్లించడంలో ఇబ్బందులు ఎదరువుతున్నాయి. మండలానికి ఒక హెచ్‌వోను, 5 వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా చేసి ఒక క్లస్టర్‌కు ఒక హెచ్‌ఈవోను నియమిస్తే.. రైతులను పూర్తిగా సేవలు అందించడానికి  అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల ఉన్నవారికి పని భారం ఎక్కువ అవుతున్నది.

రావుల విద్యాసాగర్

రాష్ట్ర అధ్యక్షుడు, 

హర్టికల్చర్ ఉద్యోగుల సంఘం

మరిన్ని వార్తలు