5 September, 2026 | 5:58 AM

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లో చేర్చుకోం

05-09-2026 | 04:30am

రాజగోపాల్ వస్తానన్నా తీసుకునేది లేదు

కాంగ్రెస్‌లో పరిణామాలు ఆ పార్టీ పతనానికే

చంద్రబాబుకు అనుకూలంగా రేవంత్ విధానాలు

తెలంగాణ నీటిని ఏపీ దోచుకుంటోంది..

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన కొండా సురేఖ(Konda Sureka)ను బీఆర్‌ఎస్‌లో చేర్చుకోబోయేది లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత జగదీశ్‌రెడ్డి(Former Minister Jagadish Reddy) పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వస్తానన్న తీసుకునేది లేదని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి కొండా సురేఖ కూతురు వ్యాఖ్యలు, తర్వాతి పరిణామాల నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో  జగదీశ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కొండా సురేఖను బర్తరఫ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఆమె కూతురు సుష్మిత లేవనెత్తిన అంశాలపై ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు.

సుస్మిత వ్యాఖ్యల వెనుక బీఆర్‌ఎస్ ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వెనుక ఎవరున్నారో చెప్పాలని నిలదీశారు. సుస్మిత ఆరోపణల వెనుక ‘అవినీతి అనకొండ’ ఉందని అన్నారు. కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నారంటూ సుస్మిత చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖ తమకు టచ్‌లో లేరని, ఆమెను బీఆర్‌ఎస్‌లోకి తీసుకోబోమని స్పష్టం చేశారు.

కుమార్తె చేసిన పనికి సురేఖను బలి చేశారని, అసలు రేవంత్‌రెడ్డిని ముందుగా బర్తరఫ్ చేయాల్సిందని అన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం మొదలైందని, వరంగల్ కాంట్రాక్టులు, హైదరాబాద్ భూములు, పారిశ్రామికవేత్తల నుంచి డబ్బుల వసూళ్ల విషయంలో పంచాయితీ ప్రారంభమైందని ఆరోపించారు. ప్రజల ముందే కాంగ్రెస్ పార్టీ దోపిడీ బట్టబయలవుతోందని అన్నారు.

కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ పతనానికి సంకేతాలుగా పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో కొందరు తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిలో ఒకరిద్దరు మినహా ఎవరినీ తీసుకోబోమని తేల్చిచెప్పారు. బీఆర్‌ఎస్‌లోకి వచ్చేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దరఖాస్తు చేసినా ఆయనను కూడా తీసుకునేది లేదన్నారు. ధరణిని తొలగించి ‘భూ భారతి’ పేరుతో భూ హారతి చేస్తున్నారని, హైదరాబాద్, రంగారెడ్డి చుట్టూ పెద్ద ఎత్తున సెటిల్‌మెంట్లు జరుగుతున్నాయని, మంత్రుల వద్దకే కమీషన్లు చేరుకుంటున్నాయని ఆరోపించారు.

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ నీటి వాటాను ఏపీ దోచుకుంటోందని, చంద్రబాబు భవిష్యత్‌లో అక్కరకు వస్తారనే సీఎం రేవంత్‌రెడ్డి ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని చంద్రబాబే నడుపుతున్నారని కాంగ్రెస్ నాయకులే అంటున్నారని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుకోవాలని డిమాండ్ చేశారు. బీటీపీఎస్, యాదాద్రి విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసు వేసింది బీఆర్‌ఎస్సేనని చెప్పారు.

ఎథిక్స్ కమిటీకి నిజంగా ఎథిక్స్ ఉండాలని, అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపైనా ఎథిక్స్ కమిటీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ చేస్తున్న పోరాటాలను ప్రజలు స్వాగతిస్తున్నారని, కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన ప్రజలకు ద్రోహం, మోసం తప్ప మరేమీ ఇవ్వలేదని విమర్శించారు.

మరిన్ని వార్తలు