కుడా చైర్మన్‌గా గుండు సుధారాణి బాధ్యతలు
హనుమకొండ, సెప్టెంబర్ 05(విజయక్రాంతి): హనుమకొండ పట్టణంలోని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(Kakatiya Urban Development Authority) కార్యాలయంలో శనివారం కుడా చైర్మన్‌గా గుండు సుధారాణి(Gundu Sudharani) కుటుంబసభ్యుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Station Ghanpur MLA Kadiyam Srihari) గుండు సుధారాణి కి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ మరింత ప్రగతిపథంలో పయనించే విధంగా, ఉమ్మడి వరంగల్ జిల్లా(Warangal district) పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన, పట్టణాభివృద్ధి పనులు వేగవంతం చేసే దిశగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయూబ్ అలీ, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






