5 September, 2026 | 1:35 PM

యాప్‌లలో కాదు యూరియా.. షాపుల్లో కావాలి!

05-09-2026 | 12:50pm
  1. నిజామాబాద్‌లో ఎరువుల కొరతపై రైతుల ఆగ్రహం
  2. సిరిసిల్ల-కొనరావుపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో

కోనరావుపేట,సెప్టెంబర్5(విజయక్రాంతి): సాగు పనులు ఊపందుకున్న వేళ యూరియా కొరతతో(Urea) అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిపడా యూరియా అందకపోవడంతో పాటు ఆన్‌లైన్ బుకింగ్, సర్వర్ సమస్యలు, ఓటీపీ ఇబ్బందులతో రైతులు అవస్థలు పడుతున్నారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla district) కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన రైతులు శనివారం ఆందోళనకు దిగారు. సిరిసిల్ల-కోనరావుపేట(Sircilla-Konaraopeta) ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. యూరియా కోసం గత కొద్ది రోజులుగా సేవా కేంద్రాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

శనివారం ఉదయం సుమారు 10 గంటలకు వెయ్యికి పైగా యూరియా బస్తాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచగా, కేవలం కొన్ని సెకన్లలోనే స్టాక్ పూర్తయినట్లు చూపించిందని తెలిపారు.సర్వర్ పనిచేయకపోవడం, రిజిస్ట్రేషన్ కాకపోవడం వల్ల యూరియా పొందలేకపోతున్నామని వాపోయారు.పంటకు యూరియా వేయాల్సిన కీలక సమయంలో డిజిటల్ ప్రక్రియ(Digital process) పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని మండిపడ్డారు.

‘యాప్‌లలో కాదు యూరియా.. షాపుల్లో కావాలి’ అంటూ నినాదాలు చేశారు. ఆన్‌లైన్ బుకింగ్ విధానాన్ని రద్దు చేసి, గతంలో మాదిరిగా నేరుగా ఎరువుల దుకాణాల్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా యూరియా అందించాలని డిమాండ్ చేశారు.రైతుల ఆందోళనతో సిరిసిల్ల-కోనరావుపేట ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి తక్షణమే యూరియా కొరతను పరిష్కరించాలని రైతులు కోరారు.

మరిన్ని వార్తలు