జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

02-10-2026 | 07:56pm

హనుమకొండ, అక్టోబర్ 2 (విజయక్రాంతి): జర్నలిస్టుల హక్కులు, భద్రత, సంక్షేమానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం డిమాండ్ల దినోత్సవం నిర్వహించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని పబ్లిక్ గార్డెన్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు నిరసన(Journalists Protest) తెలిపారు. బ్యానర్‌ పట్టుకుని సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలదండలు వేసి పూలు సమర్పించి నివాళులర్పించారు. జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయికి అందజేశారు. అలాగే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజులను కలిసి సమస్యలను వివరించి వినతిపత్రాలు అందజేశారు.

దేశంలో మారుతున్న మీడియా రంగ పరిస్థితులను సమగ్రంగా సమీక్షించి విధానపరమైన సిఫార్సులు చేసేందుకు కొత్త మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టులు, మీడియా సిబ్బంది, వార్తా సంస్థల భద్రతకు ప్రత్యేక కేంద్ర చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.

కొత్త కార్మిక చట్టాల్లో విలీనమైన 1955, 1958 నాటి వర్కింగ్ జర్నలిస్టుల ప్రత్యేక చట్టాల ద్వారా గతంలో కల్పించిన హక్కులు, ఉద్యోగ భద్రత, పని గంటలు, వివాద పరిష్కార విధానాలు, సేవల విరమణకు సంబంధించిన రక్షణలను పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు వైద్య సదుపాయాలను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. స్వేచ్ఛాయుతమైన, ఆర్థికంగా భద్రమైన మీడియా వ్యవస్థ ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరమని, దీర్ఘకాలంగా పెండింగ్‌ లో ఉన్న సమస్యలను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గడ్డం కేశవమూర్తి, ఊటుకూరు సీతారామారావు (సాయిరామ్), రాష్ట్ర హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ కన్వీనర్ వల్లాల వెంకటరమణ, నేషనల్ కౌన్సిల్ సభ్యులు పీవీ మదన్మోహన్, గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంకణాల సంతోష్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య, పొడిశెట్టి విష్ణువర్ధన్, ప్రెస్ క్లబ్ కోశాధికారి అమర్, విజయ్ భాస్కర్, గన్ను సంతోష్ కుమార్, రామారావు, ఉస్మాన్ పాషా, వాజీద్, దండు మోహన్, కొమ్మాలు బిక్షపతి యాదవ్, విజయ్ భాస్కర్, నయీమ్ పాషా, చుక్కారావు, ముదిగిరి ఓదెలు, నల్లాల బుచ్చిరెడ్డి, ప్రమోద్, అల్లే రామారావు, ప్రదీప్, బి. శ్రీహరి రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు